పేకాట క్లబ్‌లు, పైరవీలు చేసేవాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు.. : పవన్ ఫైర్
- IndiaGlitz, [Monday,April 05 2021]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం శిల్ప కళావేదికలో వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో పవన్ మాట్లాడిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అభిమానులకు మంచి బూస్ట్ ఇచ్చినట్టైంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘నువ్వు సినిమాలు చేస్తున్నావని అంటారు.. సిమెంట్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు పెట్టుకుని సినిమాలు చేయవచ్చు.. నేను సినిమాలు చేస్తే రాజకీయం చేయకూడదా? సభలో కూడా చెప్తూ ఉన్నా.. పేకాట క్లబ్‌లు నడిపే వాళ్లు ఎమ్మెల్యేలు అవ్వొచ్చు. పైరవీలు చేసేవాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు..
లక్ష రూపాయల లోపు వచ్చే ఎమ్మెల్యే పదవి కోసం ఎందుకంత తపన పడి పోతారు? నేను అవినీతి చేయకుండా ఉండేందుకు సినిమాలు చేస్తున్నా. నేను ఒక సినిమా చేస్తే వెయ్యి మంది బతుకుతారు. సినిమా పది మందికి ఉపాధికి కూడా. కేవలం నేను డబ్బు సంపాదించుకోవడానికే సినిమాలు చేయను. సినిమా అనేది కుదిరితే కచ్చితంగా చేస్తా. నాకు ఎప్పుడు పదవి మీద కోరిక లేదు.. ఏదో అయిపోవాలంటే ఆశ అంతకంటే లేదు.. నాకు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం దొరికింది. దాన్ని మించిన పదవి నాకు అవసరం లేదు.. అన్నీ బాగుండి అది కూడా వస్తే అప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి పీఠంపై మోజు లేదు. పదవీ కాంక్షతో రాజకీయాల్లోకి రాలేదు.
మీ అభిమానంతో పోలిస్తే ముఖ్యమంత్రి పీఠం కూడా నాకు చిన్నగా కనిపిస్తుంది’’ అంటూ పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలు చేస్తూనే అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ ప్రిరిలీజ్ వేడుకలోనే తానొక నటుడిగానే కాకుండా.. రాజకీయ నాయకుడిలా సైతం మారిపోయారు. తనపై నోరు పారేసుకునే రాజకీయ నేతలపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. మర్యాదగా బతికే వాణ్ని గెలికితే దాని పొగరు అంటారు.. అంతేకానీ తనలా తల దించుకొని వెళ్లిపోయే వాడిని పొగరు అంటే ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా మీ గుండెలోతుల్లో చోటు సంపాదించుకుంటుంది అని ధీమాగా పవన్ చెప్పారు. మొత్తానికి పవన్ స్పీచ్ మొత్తం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా సాగింది.