'సుస్వాగతం' కి 20 ఏళ్లు
- IndiaGlitz, [Monday,January 01 2018]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో. ఆయనకు ఉన్న అభిమాన గణం తెలుగులో ప్రస్తుతం మరెవరికి లేదన్నది కాదనలేని వాస్తవం. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. తొలి రోజు ఆయన కొత్త సినిమాకి థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే.. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌కి కారణం పవన్ తొలి రోజుల్లో చేసిన చిత్రాలే. వాటిలో 'సుస్వాగతం' ఒకటి. ఈ చిత్రంలో పవన్ నటన ఆయన అభిమానులనే కాదు.. సగటు ప్రేక్షకుడిని అలరించింది.
సినిమా చివరి వరకు ప్రేమించిన అమ్మాయి ప్రేమ కోసం నిరీక్షించే యువకుడి పాత్రలో పవన్ జీవించారనే చెప్పాలి. అలాగే పతాక సన్నివేశాల్లో తనతో స్నేహితుడిలా మెలిగే తండ్రి చనిపోయాక.. పరివర్తనతో కథానాయికకి దూరమై కెరీర్‌వైపే అడుగులు వేసే పాత్రలో పవన్ అభినయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి 'సుస్వాగతం' సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు. తమిళంలో విజయ్, సువలక్ష్మీ, మంత్ర (రాశి) ముఖ్య పాత్రల్లో నటించిన 'లవ్ టుడే'కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించగా.. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. దేవయాని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సాధిక, ప్రకాష్ రాజ్, రఘువరన్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎ.రాజ్‌కుమార్ సంగీతంలో ప్రతి పాటా సూపర్ హిట్టే. జనవరి 1, 1998న విడుదలైన 'సుస్వాగతం'.. 16 కేంద్రాల్లో 175 రోజులు ఆడి.. పవన్ కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించింది.