నితిన్‌ని సర్‌ప్రైజ్ చేసిన పవన్..

  • IndiaGlitz, [Saturday,July 25 2020]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు.. ఫంక్షన్లు తదితర వేడుకలకు కాస్త దూరంగానే ఉంటారన్న విషయం తెలిసిందే. అలాంటిది కరోనా సమయంలో.. చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయన అభిమాని పెళ్లి కంటే ముందే వెళ్లి సర్‌ప్రైజ్ చేశారు. ఆ అభిమాని ఎవరో కాదు.. హీరో నితిన్. నితిన్, షాలినీల వివాహం ఈ నెల 26న జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ముందే నితిన్ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే హైద‌రాబాద్‌లోని నితిన్ నివాసంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. అప్పటి నుంచి పెళ్లి హడావుడి ప్రారంభమైంది. కరోనా కారణంగా బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల నడుమ వివాహం చేసుకోవాలని నితిన్ ఫిక్స్ అయ్యాడు.

అయితే నితిన్‌కి పవన్ అంటే అంతులేని అభిమానం. మరి కరోనా సమయంలో నితిన్ పెళ్లికి పవన్ హాజరవుతారో.. లేదోనని అంతా భావించారు. కానీ అభిమానిని ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా శుక్రవారం పవన్.. నితిన్ నివాసంలో ప్రత్యక్షమై సర్‌ప్రైజ్ చేశారు. అభిమానిని మనసారా దీవించారు. పవన్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత చినబాబు కూడా ఉన్నారు. కాగా.. నితిన్ వివాహం ఆదివారం రాత్రి 8:30 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నుంది.