Pawan Kalyan: పవన్ కల్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి
Send us your feedback to audioarticles@vaarta.com
లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఉన్న భారత సంతతికి చెందిన అభ్యర్థి తరుణ్ గులాటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. స్వతంత్ర అభ్యర్థిగా లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణ్ గులాటీ జనసేనానిని మద్దతు కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎక్కువగా ఉన్నారని గులాటీ ఈ సందర్భంగా తెలిపారు. ఆయనక అభ్యర్థనను స్వాగతించిన పవన్.. తన అభిమానులు, జనసేన శ్రేణులు, తెలుగు ప్రజలు, భారతీయులు.. తరుణ్ గులాటీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు పార్టీ తరపున బీఫారం అందించారు పవన్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలన్నారు.హోమ్ రూల్ ఉండాలనే ఉద్దేశంతో దశాబ్దకాలం పోటీకి దూరంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరాల్సి ఉందన్నారు. తెలంగాణ సాయుధ నపోరాట స్ఫూర్తి జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తోందన్నారు. ఏపీలో అభివృద్ధి జరిగి వలసలు ఆగితేనే తెలంగాణ ఆకాంక్షలు సంపూర్ణం అవుతాయని చెప్పారు. లేదంటే ఇక్కడికి వలసలు పెరిగి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. అందుకే తాను ఏపీపై ప్రత్యేక దృష్టి సారించానని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
తొలుత 32 స్థానాల్లో పోటీ చేయాలని పవన్ కల్యాణ్ భావించారు. కానీ బీజేపీ నేతలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్దామని కోరడంతో కాస్త వెనకంజ వేశారు. దీంతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో ఎన్నికల బరిలో దిగారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పవన్ కల్యాణ్ వేదిక పంచుకున్నారు. అంతేకాకుండా తన ప్రసంగంలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదన్నారు. మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరి జనసేన పోటీ చేసే స్థానాల్లో బీజేపీ మద్దతు ఎంతవరకు లభిస్తుందో వేచిచూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments