పరిస్థితుల్ని పాట రూపంలో చెప్పిన ఆదివాసీలు.. చలించిపోయిన పవన్
- IndiaGlitz, [Thursday,December 24 2020]
మూడేళ్ల అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త విరామమిచ్చి సినిమాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ అనంతరం ‘వకీల్‌సాబ్’ షూటింగ్ మొదలు పెట్టింది మొదలు.. వరుసగా సినిమాలకు సైన్ చేసేశారు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్ అరకులో జరుగుతోంది. దీని కోసం అరకు వెళ్లిన పవన్.. షూటింగ్ విరామ సమయంలో అక్కడి ఆదివాసీలతో మాట్లాడారు. వారి కష్ట సుఖాలతో పాటు జీవన స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీనినంతటినీ ట్విట్టర్ వేదికగా పవన్ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ఒక పాట రూపంలో తమ పరిస్థితుల్ని పవన్‌కు వివరించారు. అది విన్న పవన్ చలించిపోయారు.
ఆదివాసీలు పాడిన పాటను విన్న పవన్ తనకు ‘వనవాసి’ పాట గుర్తుకు వచ్చింది. ‘‘నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో.. అరకు ఆదివాసీల, ఆంధ్ర-ఒరియాలో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట.. (వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన 'వనవాసి' గుర్తుకువచ్చింది)’’ అంటూ ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అరకు పర్యటనలో ఆదివాసీల జీవన పరిస్థితులు బాధ కలిగించాయని వెల్లడించారు. ఆదివాసీల సంస్కృతి పరిరక్షింపబడాలని.. వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావటానికి జనసేన - జనసైనికులు నిరంతరం వారికీ అండగా ఉంటారని పవన్ వెల్లడించారు.
నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది) pic.twitter.com/CkgNP3PSMA
— Pawan Kalyan (@PawanKalyan) December 24, 2020