అంగన్‌వాడీలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించిన పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
అంగన్‌వాడీలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. "నలభై రోజుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదు. వారితో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగటం సరైన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి జగన్‌కు కోటి సంతకాలతో వినతి పత్రం ఇచ్చేందుకు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసులు వారిని ఈడ్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను" అని పేర్కొన్నారు.
అంగన్‌వాడీలపై ప్రభుత్వం చర్యలు హేయం..
‘‘అంగన్‌వాడీ సిబ్బందిని అరెస్టు చేయడం వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో వారిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తూ పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఇస్తాను అని హామీ ఇచ్చారు. దాన్నే అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ వర్తింప జేయమంటున్నారు. చిన్నపాటి జీతాలతో పని చేస్తున్న వారిపట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నాం. అంగన్‌వాడీలపై పాలకపక్షానికి చెందిన సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి’’ అని తెలిపారు. కాగా విధుల్లో చేరని అంగన్‌వాడీలను ప్రభుత్వం తొలగిస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్నికల్లో జనసేనకు అండగా ఉండాలి..
ఇదిలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి, జనసేన పార్టీకి చాలా కీలకమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. యూఎస్‌కు చెందిన జనసైనికులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జన సైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపు కోసం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పనిచేసే అంశంపై వారికి దిశానిర్దేశం చేశారు.
ప్రవాసుల పాత్ర ఎంతో కీలకం..
సార్వత్రిక ఎన్నికల్లో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకం. ఎన్ఆర్ఐ జన సైనికులంతా పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. తటస్థ ఓటర్లను జనసేన వైపు ఆకర్షించాలి. పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని, పవన్ నిర్ణయాలను సామాన్యులకు అర్ధమయ్యేలా వివరించాలి. గత ఎన్నికల్లో విజయం సాధించిన రాజోలు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుని పని చేయాలి. ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నవారు తప్పకుండా స్వదేశం వచ్చి పార్టీ కోసం కృషి చేయాలి. రాష్ట్రానికి రావడానికి అవకాశం లేని వారు అక్కడి నుంచే పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులను సమాయత్తం చేసేందుకు త్వరలో యూఎస్‌లో పర్యటిస్తాను" అని నాగబాబు స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com