రైతుకి పట్టం కట్టేందుకే జనసేన.. ఇబ్బంది పెడితే నేనొస్తా!
Send us your feedback to audioarticles@vaarta.com
‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు నిరసన దీక్ష ముగిసింది. పవన్ కు నిమ్మరసం ఇచ్చిన రైతులు ఆయన దీక్షను విరమింపజేశారు. అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. పవన్‌కు నిమ్మరసం ఇచ్చిన రైతులు ఆయన దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ‘రైతుకు పట్టం కట్టేందుకే ‘జనసేన’ ఉందని, అన్నదాత కన్నీరు ఆగే వరకూ తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు మాయమాటలు చెబుతున్నవాళ్లు బాగున్నారని, రైతులే కన్నీళ్లు కారుస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా ఓటమిపాలైతే ఆ పార్టీకి చెందిన వారి ఆత్మసైర్యం దెబ్బతింటుంది కానీ, తనకు మాత్రం ఆత్మస్థైర్యం దెబ్బతినలేదని అన్నారు.
ఎవరైనా ఇబ్బందిపెడితే నేను వస్తా..!
‘మీ దగ్గరకు చాలా మంది రైతులు రావాలనుకున్నారు. ఇక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకొంటే వారి ధాన్యాన్ని కొనకుండా ఇబ్బందులుపెడతారు’ అని యువరైతు పవన్‌కు చెప్పాడు. ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీద మాట్లాడినందుకు.. ‘నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు వ్యక్తిగతంగా వచ్చి చెబితే నేను వస్తా’ అని పవన్ భరోసా ఇచ్చారు. మేం ఉన్నది రైతుకు పట్టం కట్టేందుకేనని, లాభసాటి ధరతో రైతు కన్నీరు ఆపగలిగితే, వారి జేబులో పది రూపాయిలు ఉంటే మీకు పట్టం కట్టినట్టేనని, అందుకోసం పోరాటం చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు.
బీమాతో ధీమా అనే పరిస్థితి లేదు..!
రైతు నాయకుడు జమ్మి మాట్లాడుతూ..‘పవన్ అండతో రైతు సమస్య ఫుల్ స్టాప్ పెట్టాలి. గత నెలలో కురిసిన వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకి 15-20 బస్తాలు మాత్రమే పంట వచ్చింది. ఇలా ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు పంటలను పాడు చేసినప్పుడు మద్దతు ధరతోపాటు బోనస్ కూడా ఇవ్వాలి. బస్తాకు రూ. 100 బోనస్ ఇవ్వాల్సి ఉంటే అదీ లేదు. లాభసాటి ధర మాట పక్కనపెడితే కనీసం మద్దతు ధర ఇచ్చేది అంతంత మాత్రమే. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో మొదటి పంటలో రైతుకు చేరేది శూన్యం. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అనేది తీసుకువచ్చింది. రూపాయి కడితే చాలు అంటున్నారు. కట్టేది తక్కువే కదా అన్న మాట పక్కనపెడితే వరదలు, వైపరీత్యాలు వచ్చినా బీమా మాత్రం రాదు అన్నది నిజం. బీమా అమలులో ఇప్పటికీ బ్రిటీష్ కాలం నాటి పద్దతులే అమలు చేస్తున్నారు. ఏడు సంవత్సరాల యావరేజ్ చూస్తున్నారు. పంటకు నష్టం వాటిల్లినప్పుడు గత ఏడాది పండింది కాబట్టి ఈ ఏడాది ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. పంట పోయిన మేరకు భీమా వస్తే ధీమా ఉంటుంది. దిగుబడిలో ఎంత మేర నష్టం వచ్చిందో అది ఇప్పించే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలి. ఓసీలకు రైతు భరోసా లేదనడం దుర్మార్గమైన చర్య’ అని తెలిపారు.
జనసైనికులు రైతు సైనికులుగా మారాలి!
భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల జమిల్ మాట్లాడుతూ... ‘రైతే రాజు, రైతే దేశాన్ని వెన్నుముక అని చెప్పే నాయకులంతా రైతులకు పెద్ద నామమే పెడుతున్నారు. జన సైనికులంతా రైతు సైనికులుగా మారి రైతు సమస్యలపై ఎప్పుడు పిలుపు ఇచ్చినా పోరాటం చేయాలి. రైతుకు పంట పండించడం మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఏమొస్తుంది ఎంత వస్తుంది తెలియదు. అందుకే గత 15 సంవత్సరాల్లో 3 లక్షల 25 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ హత్యలకు ప్రభుత్వాల చర్యలే కారణం. క్రాప్ హాలిడే ప్రకటించిన రోజు చాలా మంది నాయకులు కోనసీమకు వచ్చి మమ్మల్ని నమ్మించి పదవిలోకి వచ్చారు. ఆ తరవాత ఏం చేశారో అందరికీ తెలుసు. రైతులలో సంఘటిత శక్తి లేదు అంటున్న వారికి ఒక పంట రాష్ట్ర వ్యాప్తంగా ఆపేస్తే ఆ శక్తి ఏంటో తెలుస్తుంది’ అని జమిల్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments