గాజువాక కోసం జనసేనాని ప్రత్యేక మేనిఫెస్టో
- IndiaGlitz, [Sunday,March 31 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గం కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. జనసేన అధికారంలోకి రాగానే అగనంపూడిని ప్రత్యేక రెవెన్యూ డివిజన్ చేస్తామని.. ప్రభుత్వ పరమైన పనుల కోసం విశాఖపట్నం వెళ్లే అవసరం లేకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జనసేన పార్టీ ప్రధాన మేనిఫెస్టోతో పాటు ప్రతి జిల్లాకు ఒక మేనిఫెస్టో ఉంటుందని, గాజువాక నియోజకవర్గం కోసం 64 అంశాలతో ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. గాజువాక అభివృద్దికి సంబంధించి తన దృష్టికి వచ్చిన సమస్యల ఆధారంగా మేనిఫెస్టోకి రూపకల్పన చేసినట్టు తెలిపారు. జనసేన వచ్చిన మూడు నెలల్లో విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణ పూర్తి చేస్తామన్నారు.
గాజువాక నియోజకవర్గంలో ప్రజాయాత్రలో పాల్గొన్న ఆయన యాత్ర ప్రారంభంలో పవన్ మాట్లాడుతూ.. విశాఖ నగరానికి అవసరం అయిన మానవ వనరుల్ని గాజువాక నియోజకవర్గం ఇస్తుంది. అలాంటి గాజువాక అభివృద్దిని మాత్రం అంతా నిర్లక్ష్యం చేశారు. ఓ వైపు గంగవరం పోర్టు కాలుష్యం ఆ ప్రాంత వాసుల్ని ఇబ్బంది పెడుతోంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక గంగవరం పోర్టు బాధిత మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. నిర్వాసితులకి ఉపాధి, మత్స్యకారులకి జీవన భృతి కల్పిస్తాం.
గంగవరం పోర్టు నిర్మాణం చేపట్టక ముందు ఆ ప్రాంతంలో జెట్టీలు ఉండేవి. పోర్టు కారణంగా అవికాస్తా పోయాయి. పోర్టు కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కోసం కొత్త జెట్టీలు నిర్మిస్తాం. జనాభా నిష్పత్తి ఆధారంగా నియోజకవర్గానికి అవసరమైనన్ని గవర్నమెంటు కాలేజీలు ఏర్పాటు చేస్తాం. వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువగా నివసించే గాజువాకలో అన్ని డివిజన్లలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగాలు చేసుకునే మహిళల బిడ్డల సంరక్షణ నిమిత్తం ప్రతి డివిజన్‌లో శిశు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
గాజువాకలో ఉన్న ఆడపడుచుల కోసం ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. గాజువాకని ఆంధ్రప్రదేశ్‌కి ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాం. ఉద్యోగాల నిమిత్తం బిడ్డలు దూర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో నిరాదరణకు గురవుతున్న వృద్దుల కోసం ప్రతి డివిజన్‌లో పెద్దల ఆదరణ నిలయాలు ఏర్పాటు చేస్తాం. మానసిక వికాసంతో వారంతా ప్రశాంతంగా జీవించే ఏర్పాటు చేస్తాం అని పవన్ హామీ ఇచ్చారు.
ప్రతి ఇంటికీ రక్షిత నీటి సరఫరా..
గాజువాక వాసులకి ఇంటి పన్ను భారం తగ్గిస్తాం. జనసేన అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రతి ఇంటికీ రక్షిత మంచి నీటి వసతి కల్పిస్తాం. వృద్దుల కోసం ప్రత్యేక రిక్రియేషన్ క్లబ్బులు ఏర్పాటు చేస్తాం. గాజువాక మొత్తం సర్వేలు చేయించి అవసరం అయిన చోట ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకుంటాం. బహుళ ప్రయోజన బస్ కాంప్లెక్స్ నిర్మిస్తాం. రాత్రిళ్లు పని చేసే కార్మికుల కోసం ప్రత్యేక క్యాంటిన్లు, నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయిస్తాం. గతంలో గాజువాక వచ్చినప్పుడు ఇక్కడ ముస్లిం సోదరులు పండుగలు చేసుకునేందుకు తమకు ఫంక్షన్ హాల్స్ లేవన్న విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే అయిన వెంటనే రెండు వేల కెపాసిటీతో రెండు షాదీ ఖానాలు ఏర్పాటు చేస్తాం.
గాజువాకలో రౌడీయిజం ఎక్కువగా ఉందని ప్రజలు చెబుతున్నారు. జనసేన ప్రభుత్వంలో ఒక్కో రౌడీని తన్ని తరిమేద్దాం. తోపుడు బండ్ల వ్యాపారులకు అత్యంత తక్కువ ఖర్చుతో లైసెన్సులు మంజూరు చేసి, అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తాం. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 వేల వరకు పావలా వడ్డీపై రుణాలు ఇస్తాం. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు స్మార్ట్ సిటీ అంటారు. స్మార్ట్ అంటే ఇలా వైర్లు, తీగలు రోడ్ల మీద వేలాడ రాదు. ఎమ్మెల్యే అయిన వెంటనే అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టం, డ్రైనేజీ సిస్టం తీసుకువస్తాం. గంగవరం పోర్టు యాజమాన్యంతో మాట్లాడి కాలుష్య నివారణకు ఏర్పాట్లు చేస్తాం. 50 లక్షల మొక్కలు నాటించి, వాటి మెయింట్ సెన్స్ బాధ్యత యువతకి అప్పగిస్తాం. తద్వారా వారికి పాకెట్ మనీ దక్కే ఏర్పాటు చేస్తాం అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
స్టీల్ ప్లాంట్ రైతులకు న్యాయం
స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తాం. సొంత పొలాలు ఇచ్చిన రైతులు తమ పొలాల్లోనే కూలీలుగా పని చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. 2013 భూసేకరణ చట్ట ప్రకారం వారికి పరిహారం అందించడంతో పాటు స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి కల్పిస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు విశాఖ భూ నిర్వాసితులకు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే అసెంబ్లీ వేదికగా జాతి తరుపున క్షమాపణలు చెబుతా. ఆడపడుచుల కోసం కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా ఏడాదికి పది గ్యాస్ సిలిండర్లు ఇస్తాం.
రేషన్‌కి బదులుగా రూ. 2500 నుంచి రూ. 3500 మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేస్తాం. ప్రవేశ పరీక్షల రుసుంల పేరుతో చేసిన దోపిడితో నిరుద్యోగ భృతి ఇస్తున్నాయి నేటి ప్రభుత్వాలు. జనసేన ప్రభుత్వంలో అన్ని ప్రవేశ పరీక్షలకి సంబంధించి ఒక్కసారి ఫీజు చెల్లించేలా ఏర్పాటు చేస్తాం. జనసేన ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల వ్యవధిలో మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తీసుకుంటాంఅని పవన్ హామీ ఇచ్చారు.
మీ జీవితాలు బాగుండాలి..
రాజకీయాల్ని కోట్ల రూపాయిల పెట్టుబడిదారీ వ్యవస్థగా తయారు చేసి సామాన్యుడికి దూరం చేశారు. అలాంటి రాజకీయాల్ని మీకు దగ్గర చేసేందుకే జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి నిజాయితీపరులైన ఆఫీసర్లను తీసుకువచ్చాం. ఉద్యోగాల కోసం మీరు ఉద్యమాలు చేసే పరిస్థితులు మారాలి. మీ కోసం అసెంబ్లీలో మేం ఉద్యమాలు చేస్తాం. మీ జీవితాలు బాగుండాలి.
సగటు మధ్య తరగతి మానవుడికి వ్యవస్థ మద్దతు ఇవ్వనప్పుడు, ఆ వ్యవస్థని అందరి కోసం పని చేయించాలన్న ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చా. మీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా అని పదే పదే ప్రశ్నించుకున్నా, పిరికితనంతో పారిపోవడం నాకు ఇష్టం లేదు. ధైర్యంగా మీ ముందుకు వచ్చా. అదే ధైర్యంతో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని పవన్ పిలుపునిచ్చారు.