రాజధాని తరలిస్తే ఆత్మగౌరవ పోరాటమే - పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
రైతులు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది అమరావతిలో రాజధానికే.. తరలించమని కాదు తరలిస్తే అమరావతికి శంఖుస్థాపన చేసిన ప్రధాని మోడీని అవమానించడమే వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి ఏది ధ్వంసం చేద్దాం.. ఏది కూల్చేద్దామనే చూస్తోంది ప్రభుత్వ పాలన అంటే స్కూల్ పిల్లల ఆట అనుకుంటోంది
రాజధాని రైతులకు అండగా నిలుస్తాం రాజధాని రైతుల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
అమరావతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం. ఇక్కడ నుంచి రాజధాని కదలదు. కాదు, కూదడని తరలించే ప్రయత్నాలు చేస్తే ఆత్మగౌరవ పోరాటానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజధాని తరలింపును జనసేన పార్టీ రైతు సమస్యగా చూడటం లేదని, రాష్ట్ర సమస్యగా చూస్తుందని అన్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో, రైతులతో కన్నీరు పెట్టిస్తే దానిక మనుగడ ఉందడని, అధోపాతాళానికి పడిపోతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన పాపానికి చిదంబరం వంటి నాయకులు ఇవాళ ఎక్కడున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతులతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సమీకరణ ద్వారా భూములు ఇచ్చిన రైతులు వందల మంది హాజరయ్యారు. తమ బాధలను,ఆందోళనలను వివరించారు. ప్రభుత్వం రాజధానిపై తన వైఖరిని స్పష్టం చేయకుండా, మంత్రుల ప్రకటనలతో తమను అనిశ్చితిలోకి నెట్టేశారని వాపోయారు. తమకు అండగా నిలిచి రాజధాని కాపాడాలని కోరారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నాయకుల వ్యక్తిగత వైరం వల్ల ఈ సమస్య వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక చాలా బలమైన వ్యక్తి మనకి ఇప్పుడు ప్రధానిగా ఉన్నారు. అమరావతికి ఆయన శంఖుస్ధాపన చేశారు. దేశం గర్వించదగ్గ రాజధాని అమరావతి కావాలని నిర్మాణాల కోసం రూ.1500 కోట్లు విడుదల చేశారు. రాజధానిని తరలించమని కేంద్రం రూ.1500 కోట్లు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని చెప్పి రూ.1500 కోట్లు ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే మోడీని అవమానించినట్లే.
టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది అధికారం శాశ్వతం కాదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని ఇష్టానికి మాట్టాడడం మానుకోవాలి. ఇసుకను దోచేసినందుకే గత ప్రభుత్వం ఏమైందో తెలుసుకుని, కొంచెం ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు విలువనిచ్చి ప్రభుత్వంపై 100రోజుల వరకు విమర్శలె చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. దానికి కట్టుబడి ఉందాం అనుకుంటే ప్రభుత్వం మాకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదీ ధ్వంసం చేద్దాం. ఏది కూల్చేద్దాం అని ఆలోచన తప్ప.. ఏది నిర్మిద్దాం అని మాత్రం
ఆలోచించడం లేదు. ప్రభుత్వ పాలన అంటే స్కూల్ పిల్లల ఆట కాదు. బాధ్యతాయుతంగా చేయండి. పేద ప్రజల కోసం కర్నూలులోని జగన్నాథగట్టులో అప్పటి సీఎం వైఎస్ఆర్ ఇళ్లను నిర్మిస్తే... తర్వాత వచ్చిన నాయకులు వాటిని పట్టించుకోకపోవడంతో శిథిలావస్ధకు చేరుకున్నాయి. దాంతో కోట్ల రూపాయల ప్రజాధనవ వృథా అయింది. ఇలాంటి వాటికి జనసేన పార్టీ వ్యతిరేకం. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి జగన్ కు భారీ మెజార్టీ ఇచ్చారు. ఆయనపై చాలా బాధ్యత ఉంది. కులం పేరు చెప్పి రాజకీయ రంగు పులిమి ఇక్కడ నుంచి రాజధాని తరలిస్తే ఊరుకోం. ప్రభుత్వం నడపడమంటే చిన్నపిల్లల ఆటలు కాదు. ఇంతమంది ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పాలన చేస్తే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు. కార్మికుల కష్టాలు, రైతుల కన్నీటికి కారణమైతే అధోపాతాళినికి వెళ్లిపోతారు. రాజధాని నిర్మాణంలో గత ప్రభుత్వం ఏమైన అవకతవకలకు పాల్పడితే విచారించి బాధ్యులను శిక్షించాలి తప్పా.. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను శిక్షించడం సరైంది కాదు.
బొత్స మీరు కాస్త జాగ్రత్త మంత్రి బొత్స... మీకు చాలా అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులుగా పని చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ముఖ్యమంత్రిగా కూడా పని చేయాలనుకున్నారు. అన్నీ కలిసి వస్తే రేపు వైసీపీ ప్రభుత్వంలో కూడా మీరు సీఎం
అవ్వొచ్చు. దీనిని దృష్టిలొ ఉంచుకుని జాగ్రత్తగా మాట్లాడండి. మీలాంటి వ్యక్తులకు ప్రజల అభిమానం చాలా అవసరం. బొత్స కు నా విన్నపం ఏంటంటే జగన్ మాయలో పడొద్దు. ప్రజలకు చెడు వార్తలను, ప్రజా వ్యతిరేక విషయాలను జగన్ మీతోని, అనిల్ కుమార్ యాదవ్ తోని చెప్పిస్తారు తప్పా... ఆయన మనుషులతో, కుటుంబీకులతో చెప్పించరు. మీరు చెడు వార్తలకు మెసెంజర్ అవ్వకండి. రాజధానిని వ్యతిరేకిస్తే మోడీని వ్యతిరేకించనట్లే. మోడీ, అమిత్ షాలను అవమానిస్తున్నారు. అసలే మీ మీద ఫోక్స్ వాగన్ కేసు ఉన్నట్లు ఉంది చూసుకోండి. మీ మీద కూడా ఓ కన్ను వేసే ఉందని గుర్తుంచుకోవాలి.
రైతులు భూములు ఇచ్చింది కౌలు కోసం కాదు ప్రజలకు అండగా నిలబడాలన్న ఆశయం ఉంది తప్పా.. అడ్డదారిలో వచ్చే అధికారం కోసం అర్రులు చాచడం లేదు. చాలా చిత్తశుద్ధిగా, త్రికరణశుద్ధిగా పనిచేస్తాం. అందుకే మాకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా చాలా బలంగా మాట్లాడగలం. అమరావతి రైతులు వారి భూములు ఇచ్చింది ఆంధ్రప్రదే్ పున:నిర్మాణం కోసం తప్పా కౌలు కోసం కాదు. తమ బిడ్డలు, మనవలు ఉండే రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చారు. రాజధాని రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. పరిస్థితి చేయి దాటిపోతే రైతుల తరపున సమస్యను ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకెళ్తాను. ప్రధాని మోడీని దగ్గర నుంచి
చూసిన వాడిగా చెప్తున్నా... ఆయన అవినీతి, అధికార దుర్వినియోగాన్ని సహించే వ్యక్తి కాదు. 70 ఏళ్ల కాశ్మీర్ సమస్యకే పరిష్కారం చూపించారు. 151 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం.. మేము ఏం చేసినా చెల్లిపోతుంది అనుకోకండి అన్నారు పవన్.
ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది: నాదెండ్ల మనోహర్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాజకీయ అనుభవం లేని కొంత మంది మూర్ఖులు రకరకాలుగా స్పందిస్తున్నారు. గడిచిన మూడు నెలలుగా చూస్తున్నాం. ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి ప్రతి రోజు వారు చేస్తున్న ప్రకటనలు ఎన్నో అనుమానాలు, అపోహలు కలిగిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలి. రాజధాని ప్రాంత రైతులు తాము భూములు ఇచ్చింది పార్టీలకు కాదు... ప్రభుత్వానికి అని స్పష్టంగా చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం కనీస ఇంగితజ్ఞానం లేకుండా రాజధాని భూములు ఓ కులానికి చెందినవి అని మాట్లాడుతుంటే ఇక ఏం చెప్పాలి. రాజధాని కోసం 14 కులాలకు చెందిన రైతుల నుంచి 34,322 ఎకరాల భూములు సేకరిస్తే.. అందులో ఎకరం లోపు ఉన్న రైతులు 10,034 మంది ఉన్నారు. రెండు ఎకరాలు ఇచ్చిన రైతులు మరో 10వేల మందికి పైగా ఉన్నారు. రైతులు ఇంత త్యాగం చేస్తే ప్రభుత్వం మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. రాజధాని పనులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో బీహార్ లాంటి రాష్ట్రాల్లో బిల్లుల బకాయిలు చెల్లించలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లపై దాడులు జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగితే విచారణ జరిపి బాధ్యులను శిక్షించండి. ఇలా రైతులు, ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి 100 రోజులు గడువు ఇద్దామని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయనికి కట్టుబడి ఉన్నాం. కానీ ప్రభుత్వ ప్రకటనల నేపథ్యంలో రైతుల ఇబ్బందుల దృష్ట్యా స్పందించాల్సి వచ్చిందని, సమస్య పరిష్కారం దిశగా జనసేన పార్టీ ముందడుగు వేస్తుందని తెలిపారు. రాజధాని రైతు సమాఖ్య తరపున ధరణికోట రామారావు, దుర్గాప్రసాద్, లక్ష్మి తదితరులు తమ వేదనను తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments