Pawan Kalyan:వచ్చే ఎన్నికల్లో జనసేన - టీడీపీ కలిసే వెళ్తాయి.. పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
- IndiaGlitz, [Thursday,September 14 2023]
వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే వెళతాయని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రిమాండ్‌లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును గురువారం పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ , నారా లోకేష్ కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..చంద్రబాబుకు సంఘీభావం చెప్పేందుకే వచ్చానని తెలిపారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు.
చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం:
వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయని.. జగన్ పరిపాలన బాగుంటే రాజకీయంగా నేను, బాలకృష్ణ, లోకేష్ కలవాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి కాదని.. మా మూలాఖత్ రాజకీయంగా ఎంతో కీలకమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అరాచక పాలనను అంతమొందించాలంటే సమష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని.. కలిస్తే , వ్యక్తిగతంగా కలిసే వాళ్ళవేమోనని పవన్ తెలిపారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి దుర్మార్గంగా జైలుకు పంపటం బాధాకరమన్నారు.
చంద్రబాబు శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేయలేదు :
విధాన నిర్ణయాల్లో ఇద్దరి అభిప్రాయాలు వేరు కావొచ్చని.. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాన్ని విభేదించా తప్ప వ్యక్తిగతంగా కాదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తప్పుడు కేసులు అన్యాయంగా పెట్టడం బాధనిపిస్తోందని.. చంద్రబాబు శక్తి సామర్థ్యాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదన్నారు. ఒక ఆర్థిక నేరగాడు మోపిన అభియోగాలతో అరెస్టు చేయడం దుర్మార్గమని పవన్ దుయ్యబట్టారు. జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా .. రాష్ట్రంలో అభివృద్ధి, ఉద్యోగాల కల్పన ఎక్కడుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అందరికీ బురద పూయాలని జగన్ ప్లాన్ :
తాను బురదలో కూరుకుపోయాడు కాబట్టి అందరికీ ఆ బురద పూస్తున్నాడని.. వేలాది కోట్ల హెరాయిన్ మూలాలు విజయవాడలో వెలుగు చూస్తే, ఆవిషయాన్ని కప్పిపుచ్చారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పేరుతో ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నాడని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు అన్యాయం జరిగిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నవ్యాంధ్రకు బలమైన నాయకత్వం కావాలనే 2014లో భాజపా తెదేపా కూటమికి మద్దతు తెలిపానని ఆయన గుర్తుచేశారు. ఇప్పటి వరకూ మోదీ పిలిస్తేనే ఢిల్లీ వెళ్లానని పవన్ చెప్పారు.
జగన్‌కు ఇంకో ఆరు నెలలే సమయం :
విదేశాలకు వెళ్లాలంటేనే జగన్ కోర్టు అనుమతి తీసుకోవాలని.. అక్రమంగా ఇసుక, మైనింగ్ , బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఏపీ దుస్థితిపై ప్రధాని మోడీ, అమిత్ షాకు తెలియజేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆయన ఆకాంక్షించారు. పోలీస్ వ్యవస్థ ఇంత బానిసత్వంగా వుంటే ఎవరేం చేయలేరని పవన్ చెప్పారు. జగన్‌కు ఇంకో ఆరు నెలలు మాత్రమే సమయం వుందని జనసేనాని వెల్లడించారు.