రాజకీయం ఏమీ సినిమా కాదు: పవన్
- IndiaGlitz, [Monday,March 04 2019]
రాజకీయం నడపాలంటే అనుభవం కావాలి... నేను ఎవరి మీదో ఆధారపడి పార్టీ పెట్టలేదు... ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలకి ప్రిపేర్ అయ్యానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి రాక తప్పదన్న విషయం ముందే తెలుసన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని బాన్స్ హోటల్‌లో జిల్లాకి చెందిన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ... ‘అన్నీ అవగాహన చేసుకునే రాజకీయాల్లోకి వచ్చాను. అందుకోసం నేను ఎన్నో పుస్తకాలు చదివా. అవగాహన చేసుకున్నా. ఇది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఒక వేళ 2019 ఎన్నికల కోసమే వచ్చామనే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్లిపోవచ్చు. కనీసం పదేళ్లు కలిసి ప్రయాణం చేసే ఓపిక లేనప్పుడు ఏం సాధిస్తాం.? అనుకోగానే అయిపోవడానికి రాజకీయం అంటే సినిమా కాదు.
సామాజిక బాధ్యత. నేను జాగ్రత్తగా, బాధ్యతగా ఉన్నా. యువతకి బాధ్యత నేర్పేందుకు వచ్చా. మీ భవిష్యత్తు, భావితరాలు బాగుండాలని వచ్చాను. ఈ దరిద్రపు రాజకీయాలతో విసిగిపోయాం. ప్రతి జన సైనికుడు గ్రామగ్రామానికి వెళ్లండి. మన పార్టీ సిద్ధాంతాలు చెప్పండి. కులమతాలకి అతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పండి. పెద్దలని కలుపుకొని వెళ్లండి. 2019లో జనసేన సత్తా చాటండి అని పవన్ పిలుపునిచ్చారు.