జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్పూర్తిదాయకం - పవన్ కళ్యాణ్..!

  • IndiaGlitz, [Saturday,January 21 2017]

జ‌ల్లిక‌ట్టు పై ఆర్డినెన్స్ జారీ చేయాల‌ని కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని జ‌న‌సేన పార్టీ స్వాగ‌తిస్తుంది. ఇది స‌రైన స‌మ‌యంలో తీసుకున్న స‌ముచిత నిర్ణ‌యం. జ‌ల్లిక‌ట్టు నిషేధం పై త‌మిళ‌నాడులో అంకురించిన ఉద్య‌మం గ‌తంలో జ‌రిగిన హిందీ వ్య‌తిరేక ఉద్య‌మంలా మార‌క ముందే కేంద్ర ప్ర‌భుత్వం విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించ‌డంతో దేశ స‌మగ్ర‌త‌కు భంగం త‌ప్పింది. భార‌త సంస్కృతి, సంప్ర‌దాయాల వైవిధ్యాన్ని మున్ముందు గౌర‌వించ‌క‌పోతే ఇటువంటి ఆందోళ‌న‌లు త‌లెత్తే ప్ర‌మాదం ఉంది. త‌మిళుల పోరాట ప‌టిమ‌ను ఈ ఉద్య‌మం ప్ర‌తిభింబించింది. కుల‌మ‌తాల‌కు అతీతంగా త‌మిళులు అంతా ఏక‌మై జ‌ల్లిక‌ట్టుకు వ్య‌తిరేకంగా నిన‌దించ‌డం స్పూర్తిదాయ‌కం అని జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.
జ‌ల్లిక‌ట్టు పై నిషేధానికి నిర‌స‌న‌గా ల‌క్షలాది మంది మెరినీ బీచ్ చేరిన‌ప్ప‌టికీ ఎక్క‌డా అసాంఘిక సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డం మ‌న‌మంద‌రం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం. త‌మిళుల‌ సంఘటిత‌ శ‌క్తి అహింసాయుత‌మైన ప‌ద్ద‌తి న‌న్ను క‌దిలించాయి. మ‌న ద్ర‌విడ సంస్కృతి పై త‌మిళుల మ‌క్కువ‌ వారు దానిని కాపాడుకుంటున్న వైనం కొనియాడ‌ద‌గిన‌ది. త‌మిళ‌నాడులో జ‌రిగిన జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం నుంచి ఆంధ్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద‌ని గుర్తుచేస్తున్నాను. మ‌న రాజ‌కీయ నేత‌లు కూడా ఇటువంటి సంఘీభావాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని కోరుకుంటున్నాను. జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మ స్పూర్తితో ఆంధ్ర‌ప్రదేశ్ కి ప్ర‌త్యేక హోదా సాధించాలి. అయితే..వ్యాపార అవ‌స‌రాలు ఎక్కువుగా ఉండి రాజ‌కీయ నిబ‌ద్ద‌త త‌క్కువుగా ఉన్న మ‌న రాజ‌కీయ నేత‌లు త‌మిళ ఉద్య‌మం నుంచి ఎంత వ‌ర‌కు స్పూర్తి పొందుతార‌నే దానిపై నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే...ఈ విష‌యంలో రాజ‌కీయ నేత‌లు రాజీప‌డినా ప్ర‌జ‌లు మాత్రం రాజీప‌డ‌బోర‌న్న గ‌ట్టి న‌మ్మ‌కం నాకు ఉంది అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు.