దెబ్బ కొడితే పడటానికి ఇదేం 2009 కాదు 2019..
- IndiaGlitz, [Tuesday,March 26 2019]
భీమవరం, గాజువాక శాసనసభ స్థానాల నుంచి తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఆకుట్రలను తుత్తునీయలు చేసి భారీ మెజార్టీతో విజయం సాధించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్‌నే కాదని జనసేన అధినేత పవన్ సవాల్ విసిరారు. మీరు దెబ్బకొడితే పడటానికి ఇది 2009 కాదు 2019 గుర్తుంచుకోండని హెచ్చరించారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభ.
పవన్ మాట్లాడుతూ.. బలమైన సామాజిక మార్పు తీసుకురావాలని 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ చతురతతో పార్టీని విచ్ఛిన్నం చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. టికెట్లు అమ్ముకున్నాం, కోట్లు కూడబెట్టుకున్నాం అని పేపర్లు, టీవీల్లో ప్రచారం చేసి ప్రజలను పక్కదారి పట్టించారు. నిజానికి ప్రజారాజ్యం పార్టీలో అత్యధికంగా బీసీలకు టికెట్లు ఇచ్చాం. అత్యంత వెనుకబడిన జాతిగా చెప్పుకొనే యానాదుల జాతి నుంచి తుపాకుల మునెమ్మలాంటి వారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాం.
అలాంటి ఆశయాలతో ముందుకెళ్తే టికెట్లు అమ్మేసుకున్నారని గ్లోబెల్ ప్రచారం చేశారు. ఎందుకంటే వైఎస్, చంద్రబాబు కుటుంబాల నుంచి తప్ప మూడో వ్యక్తి రాజకీయం చేయడం వాళ్లకు ఇష్టంలేకే ప్రజారాజ్యంపై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే రాజకీయ ఆట జనసేన పార్టీతో ఆడాలని ఆ రెండు కుటుంబాలు చూస్తున్నాయి. చంద్రబాబు, జగన్ ల మధ్యనే రాజకీయం ఉండాలా? అయితే వారికి తెలియాల్సింది రోజులు మారాయి, కొత్తరక్తం రాజకీయాల్లోకి వచ్చింది. కాన్షీరాం స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవాడిని, పవన్ కళ్యాణ్ ప్రాణమన్నా పోవాలి లేదంటే బలమైన సామాజిక మార్పు అన్న జరగాలి తప్ప వెనకడుగు వేయడు. ఇంత వరకు కులాలను విడదీసి రాజకీయం చేశారు. ఇప్పుడు కులాలను కలిసే రాజకీయం జనసేన చేస్తుంది అని పవన్ చెప్పుకొచ్చారు.
జగన్‌లా టిక్కెట్లు ఆశ చూపలేదు
రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్ధం.. కత్తికి ఖండగ నరికేటెందుకు ఉన్నానెప్పుడు నే సిద్ధం. రాక్షస రాజ్యం అంటే లా అండ్ ఆర్డర్ సరిగా ఉండదు. ఇంట్లో సొంత మనిషి హత్య జరిగితే వేలిముద్రలు, రక్తపుమరకలు తుడిచేయగలరు. లక్షకోట్లు, వేల ఎకరాలు దోచేయగలరు. అడ్డొస్తే కిరాయి మూకలతో దాడులు చేయించగలరు. ఇలాంటి రాక్షస రాజ్యం నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికే జనసేన పార్టీ స్థాపించాం. ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిలా టికెట్లు ఇస్తామని ఆశచూపి గొడ్డిచాకిరి చేయించుకుని వదిలించుకునే సంస్కృతి జనసేన పార్టీకి లేదు. కష్టమో..? నష్టమో..? సామాన్యులకు టికెట్లు ఇచ్చాం. గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాటం చేస్తాం.
జనసేన పార్టీకి డబ్బులు పెట్టింది పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు, టికెట్లు ఆశించిన వ్యక్తులు కాదు. నేను అన్నదమ్ములుగా చూసుకునే జనసైనికులు. వాళ్ల దగ్గర ఉన్న కొంచెం డబ్బులతో పార్టీకి జెండాలు కట్టారు తప్ప.. ఎవరి దగ్గర డబ్బులు ఆశించి టికెట్లు అమ్ముకోలేదు. జగన్మోహన్ రెడ్డి లక్షన్నర కోట్లు దోచేశాడని తెలుగుదేశం పార్టీ 2014లో పుస్తకం వేశారు. తెలుగుదేశం పార్టీ రెండున్నర లక్షల కోట్లు దోచేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుస్తకం విడుదల చేసింది. రెండు పార్టీలు కలిపి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల ప్రజాధనం దోచేశారని వాళ్లే ఒప్పుకున్నారు. ఇలాంటి పార్టీలు అధికారంలోకి వస్తే కట్టుకున్న గుడ్డ కూడా మిగలదు అని పవన్ అన్నారు.
మాయావతి చూపిన ఆదరణ కదిలించింది
ఉత్తరప్రదేశ్ వెళ్లి బీఎస్పీ అధినేత మాయవతి గారిని కలిస్తే .. ఆమె మాపై చూపించిన ఆదరణకు కదిలిపోయాను. నాకు ఆమెలో మాతృమూర్తి కనిపించింది. వేమూరి సభ నుంచి ఆమెకు హృదయపూర్తక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో కాన్షీరాం గారు పక్కన లేకుండా ఒక ఆడపడుచు యుద్ధం చేసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో సమానంగా బీఎస్పీని జాతీయ పార్టీగా నిలబెట్టింది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆనందం కలిగించింది. సోదరి మాయవతి గారు అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను కలుపుకొని వెళ్లారు. కులాల ఐకత్యగురించి జనసేన పార్టీ ప్రస్థా విస్తుంది అంటే దానికి ఒక కారణం మాయవతి అని పవన్ అన్నారు.
యువ రైతులను తయారు చేస్తాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా మన దగ్గర నవరత్నాలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబులా గాల్లో మేడలు కట్టే హామీలు ఇవ్వను. జనసేన పార్టీ అమలు చేయగలిగే హామీలను మాత్రమే ఇస్తుంది. 2019లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యువత భవిష్యత్తకు ప్రాధాన్యం ఇస్తాం. స్పెషల్ అగ్రికల్చర్ జోన్లు ఏర్పాటు చేసి లక్షమంది యువరైతులను తయారు చేస్తాం. 3 లక్షల బ్యాక్ లాగ్ పోస్టులను ఆరు నెలల్లో భర్తీ చేస్తాం. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు బలమైన రక్షణ వ్యవస్థ కోసం 25వేల మందితో స్పెషల్ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తాం. రాష్ట్రంలో మూతపడ్డ సహకార రంగంలో ఉన్న అన్ని మిల్లులను తెరిపిస్తాం. పరిశ్రమల ఆస్తులు రాజకీయ నాయకులు దోచేయకుండా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే నా మొదటి సంతకాన్ని రైతులకి నెలకి రూ. 5 వేల ఫించన్ ఇచ్చే పథకం మీద పెట్టాలని నిర్ణయించుకున్నా.
దీంతో పాటు ఎలాంటి హామీ పత్రాలు లేకుండా రైతులందరికీ ఏడాదికి ఎకరానికి రూ. 8 వేల చొప్పున సాగు సాయం అందచేస్తాం. కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా, ఆదాయంతో సంబంధం లేకుండా ఆడపడుచులకు ఉచిత గ్యాస్ అందించే పథకం మీద రెండో సంతకం చేస్తాం. ఏడాదికి ఆరు నుంచి పది సిలిండర్లు ఉచితంగా జనసేన ప్రభుత్వం అందచేస్తుంది. తదుపరి సంతకం రేషన్ బియ్యం, పనికిరాని పామాయిల్‌తో ఇబ్బందులు పడుతున్న మీ కోసం రేషన్‌కి బదులు రూ. 2500 నుంచి రూ. 3500 వందలు మహిళల ఖాతాలకి జమ చేసే పథకంపై పెడతానని హామీ ఇచ్చారు.
నా తండ్రి వారసత్వంగా వేలకోట్లు, వేల ఎకరాలు ఇవ్వలేదు. కుదిరితే 10 మందికి మంచి చేయమని, ధర్మంగా బతకమని చెప్పారు. మీకు ఓటుకు డబ్బులు ఇవ్వలేను కానీ.. మీ భవిష్యత్తు కోసం నా భవిష్యత్తను పణంగా పెడతాను. గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి బాపట్ల లోక్ సభ స్థానానికి జనసేన కూటమి తరపున పోటీ చేస్తున్న దేవానంద్‌ని, అలాగే వేమూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న భరత్ భూషణ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలిఅని పవన్ కల్యాణ్ కోరారు.