ఓడిపోతామని ముందే తెలుసు.. పవన్ షాకింగ్ కామెంట్స్!
- IndiaGlitz, [Saturday,July 06 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీసీ విజయ దుందుభి మోగించగా.. టీడీపీ, జనసేన పార్టీలు ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. ఓడిన రెండు పార్టీల అధినేతలు ఎక్కడ లోపం జరిగింది..? ఎందుకు ఓడిపోయాం..? అని పోస్టుమార్టమ్ పనిలో బిజిబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తానా సభలకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటమిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు సీట్లు రావని.. ఓడిపోతామని ముందే తెలుసునని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు విన్న ఫ్యాన్స్, కార్యకర్తలు షాక్ అయ్యారు
కొందరు వెళ్లొద్దన్నారు!
ప్రతి ఓటమి నుంచి ఓ పాఠం నేర్చుకుంటున్నాను. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాను. కులాలు, మతాలు, ప్రాంతాలుగా ప్రజలు విడిపోరాదు. తాను తానా సభలకు వెళ్లాలా? వద్దా? అని మదనపడ్డాను. కొందరు వెళ్లాలని, కొందరు వెళ్లొద్దు అన్నారు. చివరకు వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. మనుషులను కలిపేలా జనసేన రాజకీయాలు ఉంటాయి. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం కష్టమని నాకు తెలుసు. మారే ప్రజల కోసం నేను నమ్మిన మార్గంలోనే నడుస్తాను అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఎన్నో సమస్యలున్నాయ్!
జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తులే బయట తిరుగుతున్నారు. అటువంటిది నేను రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటి.? అపజయం నన్ను మరింత బలోపేతం చేసింది. పాలకులు భయపెట్టి పాలిస్తామంటే కుదిరే పరిస్థితి నేటి సమాజంలో లేదు. నాయకులు నియంతలుగా మారితే ప్రజలు గుణపాఠం చెబుతారు.. ఇది చరిత్ర ఎన్నోమార్లు ఈ సత్యాన్ని చెప్పింది. విలువలతో రాజకీయాలు చేయబట్టే జనసేన ఓడిపోయింది. జనసేన పార్టీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని, తమలో తప్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలి అని ఈ సందర్భంగా ఎన్నారైలకు పవన్ కల్యాణ్ సూచించారు. పవన్ స్పీచ్ విన్న కొందరు వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు... గతంలో పవన్ కల్యాణ్.. ‘నేనే సీఎం.. చంద్రబాబు, జగన్ ఎలా అవుతారో చూస్తా.. నేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా’ అనే కామెంట్స్‌ను సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు.