బాబు, జగన్‌లా కాదు.. నేనోంటో చూపిస్తా: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
మత గ్రంథాలు పట్టుకుని, మతం పేరుతో వేరుచేసే రాజకీయం చేయడం నచ్చదని, మానవత్వానికి నిలబడటమే నచ్చుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతిని డెవలప్ చేస్తారు... జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కడపను డెవలప్ చేస్తారు... అదే నేను ముఖ్యమంత్రి అయితే మానవత్వాన్ని నిలబెడతానని అన్నారు. రాయలసీమలో నా ఇంటిపేరుతో గ్రామం ఉంది.. పుట్టింది గుంటూరులో, పెరిగింది నెల్లూరులో, చెన్నైలో ఉన్నాను... పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ... అందుకే నాకు దేశమంతా ఒక్కటేనని, అందరిని సమానంగా చూస్తానని పవన్ చెప్పుకొచ్చారు.
చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద జనసేన పోరాటయాత్ర సభలో పవన్ మాట్లాడుతూ.. "చిత్తూరు అంటే గుర్తొచ్చేది జిడ్డు కృష్ణమూర్తి. భారతదేశం తాలుకు ఆధ్యాత్మిక విలువ చాటి చెప్పిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతానికి కొన్ని కుటుంబాలు చెడ్డపేరును తీసుకొస్తున్నాయి. చిత్తూరులో రౌడీయిజాన్ని జనసేన నియంత్రిస్తుంది. రాజకీయాల్లో విలువలు అథ: పతాళానికి పడిపోతుంటే విసుగొచ్చి, తెగింపుతో పార్టీ పెట్టాను. రూపాయి ఖర్చులేకుండా జనమే నా బలం .. జన బలమే నా గళం అని నమ్మి ముందుకు కదిలాను. కొంతమంది గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు రాయలసీమలో జనసేనకు బలం లేదు అంటున్నారు. నా బలం వాళ్లకేం తెలుసు. 2009లో ఒకసారి దెబ్బతిన్నాం. అవమానాలు ఎదుర్కొన్నాం. మార్పు కోసం బలమైన ఉద్యమాలు తీసుకువచ్చాం" అని పవన్ అన్నారు.
అందుకే జనసేన పార్టీ పెట్టా..
"ఇది దెబ్బతిన్నవాడు పెట్టిన పార్టీ. దోపిడి, అవినీతి రాజకీయ వ్యవస్థల తుప్పురాలగొట్టడానికే పార్టీ పెట్టాను. కష్టాలు ఉంటాయని తెలుసు. ఎదురుదాడులు ఉంటాయనీ తెలుసు. అన్నింటికీ సిద్ధపడే వచ్చాను. కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు. ముక్కుముఖం తెలియవాళ్లు, పరిచయం లేనివాళ్లు, ఒకే భావజాలంలో ఆలోచించే వారందరిని ఒక చోటుకు చేర్చాను. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు, పుంగనూరు నుంచి చిత్తూరు వరకు అందరిని కొత్తవారిని అభ్యర్ధులుగా నిలబెడతాం. చిత్తూరులోని సహకార రంగంలోని డెయిరీని హెరిటేజ్ కోసం చంపేశారు. సహకార చక్కెర కర్మాగారం మూయించేశారు. జనసేన ప్రభుత్వం వచ్చాక సహకార రంగానికి ఊపిరిపోసి రైతాంగానికి మేలు చేస్తుంది" అని పవన్ ఈ సందర్భంగా చిత్తూరు వాసులకు భరోసా ఇచ్చారు.
ఎర్ర చందనం మాఫియాలో అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కు..
"శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఎర్రచందనం అడ్డగోలుగా దోచేస్తున్నారు. రాజకీయనాయకులకు తెలియకుండానే స్మగ్లర్లు దోచుకుంటున్నారా..? ఎర్రచందనం అమ్మితే వచ్చిన డబ్బుతో అమరావతి కట్టొచ్చు అన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఎర్రచందనం దుంగలను అమ్మలేకపోయారు. అవి పుచ్చుపోతున్నాయి. వేలంలో కొనటానికి వచ్చినవాళ్ళను లోకల్ మాఫియా బెదిరించి రేటు పడిపోయేలా చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో తెలుగుదేశం, వైసీపీ నాయకులు కుమ్మకైపోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఏడుకొండలవాడి సంపదను దోచేస్తే ఏ ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలరు. జనసేన ప్రభుత్వం వస్తే ఒక్కొక్క స్మగ్లరు, వారి వెనక ఉన్న ఒక్కొక్క రాజకీయ నాయకుడికి తోలు తీసి జైల్లో కూర్చోబెడతాం. శిశుపాలుడు తప్పులు కృష్ణుడు లెక్కబెట్టినట్లు రెండు పార్టీల నాయకుల తప్పులు ప్రజలు లెక్కబెడుతున్నారు" అని అధికార, ప్రతిపక్ష పార్టీలపై పవన్ ఒంటికాలిపై లేచారు.
రాయలసీమ అంటే లక్ష కోట్లు తినే నాయకులేనా?
"ఎన్నికల సీజన్ దగ్గరపడటంతో అధికార పక్షం, ప్రతిపక్షం పోటాపోటీగా ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. జేబులో లక్ష రూపాయలు ఉంటే రూ. 5 లక్షలు విలువ చేసే హామీలు గుప్పిస్తున్నారు. జనసేన పార్టీ దగ్గర వేల కోట్ల సంపద లేదు. హెరిటేజ్ వంటి వ్యాపారాలు లేవు. రాయలసీమకు హైకోర్టు బెంచ్ కావాలని డిమాండ్ ఉంది. దీనిపై చర్చించి ఈ ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. నిజాయితీగా ఆచరించగలిగే మ్యానిఫెస్టోనే జనసేన తీసుకొస్తుంది. రాయలసీమ అంటే ఇప్పటి వరకు లక్షకోట్లు తినే నాయకులు మాత్రమే కనిపించారు.. ఇక మీదట లక్ష ఉద్యోగాలు ఇచ్చే నాయకులు కనిపిస్తారు" అని పవన్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout