నాకు కుల పిచ్చి లేదు.. పవన్ కల్యాణ్
- IndiaGlitz, [Tuesday,April 09 2019]
కులాల్ని వాడుకుని నాయకులు ఎదిగే సమాజంలో ఓ బలమైన మార్పు కోసం ముందుకు వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అమలాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ... చాలా మంది కాపు నాయకులు తోట త్రిమూర్తులు లాంటి వారు తన దగ్గరకు వచ్చి మేం చాలా నలిగిపోతున్నామని.. ఇన్నాళ్లు పల్లకీలు మోశామని చెబుతుంటే వింటూ వచ్చానన్నారు. నేను అయితే ఎవర్నీ పార్టీలోకి రమ్మనలేదు.. ఆహ్వానించలేదు. ఇష్టపడి వస్తాం అంటే సంతోషం అన్నాను. ఇలా మాటలు మార్చే మీలాంటి వ్యక్తుల్ని చెంచాలు అంటారు. చెంచా అంటే చెయ్యి ఎటుతిప్పితే అటు తిరిగేది. దశాబ్దాల తరబడి వాళ్ల పల్లకీలు మోశాం, కొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ నిర్మిద్దామన్న సదుద్దేశంతో, వేల కోట్లు లేకుండా, కేవలం ఆశయం అన్న బలంతో ముందుకు వస్తే, సొంత కులం అని చెప్పి వచ్చిన వారే దెబ్బ కొడుతున్నారు. టీడీపీకి మద్దతు ఇస్తున్నానని ప్రచారం చేస్తున్న ఇలాంటి వారిని ఏమనాలి అని పవన్ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు.
రిజర్వేషన్ల గురించి మాట్లాడే దమ్ము ఉందా?
నాకు మాత్రం కులం, మతం, ప్రాంతం అన్న బేధం తెలియదు. మానవత్వం మాత్రమే తెలుసు. నేను ఎన్నో కష్టాలుపడి ఇంత వరకు వచ్చాను. నేను కాపు కులంలో పుట్టానుగానీ కులం అంటే పిచ్చి లేదు. గౌరవం మాత్రమే ఉంది. అలాగే దళితుల పట్ల గౌరవం ఉంది. దళితుల్లో చిట్టచివరి కులం అయిన రెల్లి కులాన్ని నేను స్వీకరించాను. కోనసీమలో శెట్టిబలిజలు-కాపులు ఎందుకు గొడవ పడాలి. కులాల్ని వేరు చేసే రాజకీయం కాదు. కలుపుతూ సాగే రాజకీయం కావాలి. జగన్మోహన్‌రెడ్డికి కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడే దమ్ము ఉందా? మాట్లాడమంటే పారిపోతారు. రాయలసీమలోని పులివెందుల వెళ్లి చూడండి దళితులు ఎదుర్కొనే ఇబ్బందులు తెలుస్తాయి. పైకి ప్రేమ, దళితుల ఆత్మగౌరవం అంటారు. అక్కడేమో దళితులు నాయకుల ముందు చెప్పులు చేత్తోపట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. నేను చిన్న కుటుంబం నుంచి వచ్చా. అందరి సమస్యలు అర్ధం చేసుకున్నా. మామగారు పెట్టిన పార్టీని తన పార్టీగా మార్చుకుని చంద్రబాబు బలపడ్డారు. తండ్రి నుంచి సంక్రమించిన రాజకీయ వారసత్వం ద్వారా జగన్ పార్టీ నడుపుతున్నారు. జనసేన మాత్రమే కేవలం జనసైనికులు, ఆడపడుచుల దీవెనలతో సాగుతోంది. నేను పార్టీ పెట్టినప్పుడు ఎన్నో మాటలు అన్నారు. కాపులకే పని చేస్తారు అన్నారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. అన్ని కులాలను, మతాలను సమంగా చూడగలిగే బలమైన ఆలోచనా శక్తి నాకు ఉంది అని పవన్ తెలిపారు.