మోదీ అంటే బాబు, జగన్‌కు భయం: పవన్
- IndiaGlitz, [Thursday,March 21 2019]
ప్రధాని మోదీ అంటే ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు భయం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గాజువాక నియోజకవర్గానికి గాను గురువారం నాడు నామినేషన్ వేసిన పవన్.. అనంతరం మాట్లాడుతూ జగన్, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పవన్ మాటల్లోనే...
2014లో ఎన్నికల ప్రచారానికి మోడీ వచ్చినప్పుడు పవన్‌కళ్యాణ్ మిత్ర, భాయ్ అంటే భయమేసింది. ఓట్లు వేయించుకుని ఎక్కడ అన్యాయం చేస్తారో అని భయం వేసింది. నన్ను గుర్తించమని ఏ రోజూ అడగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వమని అడిగా. ఇవ్వకపోగా విశాఖ పోర్టులో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌ని మూసివేసే ప్రయత్నం చేశారు.
ట్రేడ్ యూనియన్లు విషయం నా దృష్టికి తీసుకువచ్చినప్పుడు బలంగా నిలబడ్డా. ఎందుకంటే ప్రధాని అంటే నాకు భయం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిలకు మాత్రం మోదీ పేరు చెబితే వెన్నులో వణుకు. వారికి ప్రధాని అంటే భయం.. నాకు లేదు. ఎందుకంటే మనం తప్పులు చేయలేదు. తప్పులు ఉంటే గట్టిగా మాట్లాడలేం.
జగన్మోహన్‌రెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఏదైనా అడిగితే ఫైల్స్ చూపిస్తారు. అంతా ఆలోచించండి అలాంటి నాయకులకి ఓటు వేయడం అవసరమా. అంతా ప్రశాంతంగా ఇంటికి వెళ్లి ఆలోచించండి. ఎలాంటి వ్యవస్థలు, రాజకీయాలు కావాలో మీరే తేల్చుకోండి. కిరాయి మూకల్ని పంపి భయపెడదామంటే ఇది భయపడే ప్రాంతం కాదు. ట్రేడ్ యూనియన్లు ఉన్న గడ్డ ఇది. విశాఖ పవిత్రత చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఏం చేయాలో వారికి తెలుసు అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.