ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సూర్య భగవానుడిని మనం ప్రత్యక్ష దైవంగా కొలుస్తామని.. ఆ భగవంతుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా ఎంతో వేడుకగా మూడు రోజుల పాటు పండుగ జరుపుకుంటామని పవన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘శ్వేత పద్మధరుడు సూర్య భగవానుడిని మనం ప్రత్యక్ష దైవంగా కొలుస్తాము. ఆ భగవంతుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా ఎంతో వేడుకగా మూడు రోజుల పాటు పండుగ జరుపుకుంటాం.
పుష్కలంగా పండే పంటలు భారతీయులకు సిరులను అందించే కాలం కావడంతో సంక్రాంతి సంబరాలు ఎంతో ఆడంబరంగా సాగుతాయి. అయితే ఈ సంక్రాంతి పంటలతో పాటు కరోనా మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్ కూడా తీసుకురావడం ఎంతో ఆనందదాయకం. సంక్రాంతి తరువాత భారతదేశంలో వ్యాక్సిన్ ప్రారంభం కావడం శుభ పరిణామం. వ్యాక్సిన్ రూపకర్తలకు, ప్రోత్సహించిన ప్రభుత్వాలకు, మార్గదర్శకులైన అధికారులకు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ముఖ్యంగా తెలుగువారి ఆచార, అభిరుచులను తెలియజేసే ఈ సంక్రాంతి పండుగ దేశ ప్రజలు, తెలుగువారికి సిరి సంపదలతో కూడిన ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. మదమాత్సర్యాలు, మత మౌఢ్యాలు భోగి మంటలలో దహనం కావాలని ఆశిస్తున్నాను. హైందవులు పరమ పుణ్య దినాలుగా భావించే ఈ ఉత్తరాయణ కాలం నుంచి పాలకులు ఆదర్శవంతమైన పాలన అందించాలని, జవాబుదారీతనాన్ని అవలంభించాలని ఆశిద్దాం. అనుకూలమైన ప్రకృతితో దేశం సుభిక్షంగా శోభిల్లాలని కోరుకుంటూ నా తరుఫున, జనసేన శ్రేణుల తరుఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’’ అని పవన్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments