షర్మిల పార్టీపై స్పందించిన పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. ‘షర్మిల ఇంకా పార్టీ స్థాపించలేదు కదా?, పార్టీ విధివిధానాలు వచ్చాక మాట్లాడదాం. ప్రతీ ఒక్కరూ పార్టీ పెట్టుకోవచ్చు. తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే కోరుకుంటున్నా. కేసీఆర్ పాలన గురించి హైదరాబాద్‌లోనే మాట్లాడతా’ అని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీపై ప్రజలు చూపుతున్న ఆదరణ గురించి మాట్లాడుతూ.. ‘‘జనసేన పార్టీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ, నమ్మకం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. పార్టీ కార్యాలయానికి అందుతున్న ఫలితాల వివరాలు సంతృప్తిని కలిగిస్తున్నాయి.
హంగు, ఆర్భాటం, ధన బలం ప్రభావం లేకుండానే ఈ ఎన్నికలలో జనసైనికులు చూపుతున్న పోరాటపటిమ నన్ను ఆకట్టుకుంటోంది ఈ ఎన్నికలలో మనం చూపుతున్న ప్రభావం, ఫలితాలు రాబోయే విజయాలకు సంకేతాలుగా భావిస్తున్నాను. ఉరకలెత్తే ఉత్సాహంతో యువకులంతా నామినేషన్లు వేయడంతోనే మన ధ్యేయం సగం నెరవేరిందని భావించాను. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పక్షం ధన, బల ప్రయోగాలు... ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అందరూ చూస్తున్నారు. వీటిని తట్టుకొని గుండె ధైర్యంతో జనసేన భావజాలం, మద్దతుతో అభ్యర్థులు నిలిచారు. వారికి వెన్నుదన్నుగా పార్టీ శ్రేణులు ఉన్నాయి.
మన విజయాల గురించి మనకు మనమే ప్రచార సాధనాలు కావాలి. మన విజయాలను తక్కువ చేసి చూపే వారి గురించి ఆలోచించకండి. మన లక్ష్యం వైపే గురి నిలపండి. ఈ ఎన్నికలలో జనసేన భావజాలంతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు. ఈ విజయంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ, జనసేన జెండాను గ్రామ గ్రామానికి తీసుకువెళ్లిన జనసైనికులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే స్ఫూర్తిని మలి దశ ఎన్నికలలోనూ కొనసాగించాలని కోరుకుంటున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments