పంతాలకు కాదు.. ప్రజారోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వండి!

  • IndiaGlitz, [Wednesday,March 18 2020]

కరోనా వైరస్ విజృంభించి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టి స్క్రీనింగ్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు, ల్యాబులు పెంచాలని ఆయన సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారి (పెండమిక్)గా ప్రకటించిన తరువాత కూడా తేలిగ్గా తీసుకోవడం సరికాదని.. మన రాష్ట్రంలో లేదు... వైరస్ వస్తుంది.. పోతుంది అనుకొనే తరుణం కాదన్నారు.

విద్యా సంస్థలు మూసేయండి!

‘వైరస్ విస్తృతి మొదటి రెండు వారాల తరవాతే ఉంటుంది అని ఇతర దేశాల అనుభవాల ద్వారా వెల్లడవుతోంది. రాజకీయ అవసరాల కోసం కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోకూడదు. వాటిని వదిలి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తు.చ. తప్పకుండా అమలు చేయాలి. కేంద్రం చెప్పిన విధంగా తక్షణమే అన్ని విద్యా సంస్థలను మూసివేయాలి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో, బస్టాండులు, రైల్వే స్టేషన్లలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతోపాటు వైద్య బృందాలను నియమించాలి’ అని ప్రభుత్వానికి జనసేనాని సూచించారు.

బాధ్యతగా తీసుకోవాలి!

‘రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు ప్రజలని అప్రమత్తం చేయడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. జనసేన పార్టీ తరఫున మా శ్రేణులకు ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రణాళిక ఇచ్చాం. ప్రజలకు ఈ వైరస్, దాని విస్తృతిపై ప్రాథమిక అవగాహన కల్పించడంతోపాటు... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేసే వివరాలు జనసేన నాయకులకు, జనసైనికులకు తెలియచేశాం’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.