మంగళగిరిలో రేపు జనసేన ఆవిర్భావ సభ .. అన్నింటికీ రేపు సమాధానం చెబుతా : పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Monday,March 14 2022]

జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ ఎనిమిదేళ్లు పూర్తి చేసికుని తొమ్మిదో ఏట అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. జనసైనికులతో పాటు రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ సభకు ఆహ్వానితులే అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి క్షేమంగా సభకు వచ్చి విజయవంతం చేయాలని పవన్ కోరారు.

ఈ సభను జనసేన ఆవిర్భావ దినోత్సవంగా చూడటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశానిర్దేశం చేయబోతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఏంచేసింది, జనం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారన్నది సభలో ప్రస్తావిస్తామని ఆయన పేర్కొన్నారు. చాలా మందికి సందేహాలు ఉన్నాయని, విమర్శలు కూడా చేశారని, వీటన్నింటికీ ఆవిర్భావ సభలో సమాధానాలు చెబుతామని పవన్ చెప్పారు.

జనసేన సభకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టామని... ఆయన స్ఫూర్తితోనే తన ప్రసంగం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జనసేన ఆవిర్భావ దినోత్సవం మన హక్కు అని చెప్పాలంటూ శ్రేణులకు పవన్ సూచించారు. మరోవైపు విజయవాడలో జనసేన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం కలకలం రేగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు వారధి వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోలీసులను ప్రశ్నించారు.