ఎమ్మెల్యేను ప్రశ్నించడమే వెంగయ్య చేసిన తప్పా?: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
తమ గ్రామ సమస్యలను గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు దృష్టికి తీసుకెళ్లినందుకు జనసైనికుడు వెంగయ్యనాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో మనస్థాపానికి గురైన వెంగయ్య నేడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పారిశుద్ధ్య సమస్యపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవల్సిందేనా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకొన్నారని తెలిసి బాధకు లోనయ్యానని తెలిపారు. వెంగయ్య కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘‘తమ గ్రామంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది... రహదారి లేదు... ఇతర సౌకర్యాల కల్పన ఏమైంది అని ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు ఈ రోజు శ్రీ బండ్ల వెంగయ్య నాయుడు ప్రాణాలు తీసుకొనే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరం. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని సింగరపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబుని కోనపల్లిలో పారిశుధ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, రహదారులు లేవు... ఇతర ఏ సౌకర్యాలు లేవని... ఎప్పుడు కల్పిస్తారని జనసేన కార్యకర్త శ్రీ వెంగయ్య నాయుడు ప్రశ్నించారు.
అందుకు సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే శ్రీ రాంబాబు - 'నీ మెడలో పార్టీ కండువా తీయ్...' అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో రాష్ట్ర ప్రజలు చూశారు. ప్రశ్నించిన ఆ యువకుణ్ణి ప్రజల మధ్యనే బెదిరించిన ఎమ్మెల్యే- తదుపరి తన పార్టీ వ్యక్తుల ద్వారా బెదిరించడం, వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది. ఈ రోజు శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకొన్నారని తెలిసి బాధకు లోనయ్యాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. శ్రీ వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.
ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
తమ గ్రామంలో సౌకర్యాల కోసం ప్రజల తరఫున గళమెత్తి ఎమ్మెల్యేను ప్రశ్నించడమే శ్రీ వెంగయ్య నాయుడు చేసిన తప్పా? అతను తన ఒక్కడి సౌకర్యం కోసం ప్రశ్నించలేదు... ఊళ్ళో ప్రజలందరి కోసం మాట్లాడాడు. ఆ గొంతు అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు భయం పుట్టించింది. ఆ భయంతోనే శ్రీ వెంగయ్య నాయుడు గొంతు నొక్కే పని ఆ క్షణం నుంచే అధికార పక్షం మొదలుపెట్టింది. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. గ్రామంలో కనీస సౌకర్యాల గురించి అడిగినందుకు ప్రాణాలు కోల్పోవలసిందేనా? ఇది వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. తన నియోజకవర్గ ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేనప్పుడు ఆ పదవిలో ఉండి ఏమి ఉపయోగమో సదరు ఎమ్మెల్యే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శ్రీ వెంగయ్య నాయుడు మృతిపై సమగ్ర విచారణ చేయించాలి. అధికార పక్షం ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలి. అతన్ని బెదిరింపులకు గురి చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే శ్రీ రాంబాబు, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’’ అని పవన్ డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com