ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. జేజేలు పలకడం తప్ప..: పవన్

జనవరి 15 ఆర్మీడేను పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. 130 కోట్లమంది భారతీయుల ప్రాణాలను అనుక్షణం రక్షించే జవానుల రుణాన్ని మనం ఏమిచ్చి తీర్చుకోగలం.. నిండైన మనసుతో జేజేలే పలకడం తప్ప అని పవన్ పేర్కొన్నారు. ‘‘జనవరి 15... ఆర్మీ డే. భారతీయులందరికీ పుణ్యదినం. మన వీర జవానుల త్యాగాలను త్రికరణ శుద్ధిగా స్మరించుకునే రోజు. 130 కోట్లమంది భారతీయుల ప్రాణాలను అనుక్షణం రక్షించే జవానుల రుణాన్ని మనం ఏమిచ్చి తీర్చుకోగలం.

నిండైన మనసుతో వారికి జేజేలు పలకడం తప్ప. ఎండనక, వాననక, కాలాలకు అతీతంగా అహర్నిశలు మన దేశపు సరిహద్దులను కాపాడే మన సైనికుల త్యాగనిరతి వెలకట్టలేనిది. మన ప్రాణాలను రక్షించడానికి తమ ప్రాణాలను అడ్డువేసే వారి ధీరత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నాను. ఈ దేశాన్ని కాపాడే వీరపుత్రులకు నా తరపున, జనసేన శ్రేణుల తరపున జేజేలు పలుకుతున్నాను’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

కాగా.. నేడు కనుమ పండుగను పవన్ గోశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గోశాలలో కనుమకు సంబంధించిన పూజలను నిర్వహించారు. గోవులను అలంకరించి వాటికి ఫలాలు, ఇతర ఆహారం అందించి నమస్కరించారు. గోమాతను పూజించడం, సంరక్షించడం మన సంస్కృతిలో భాగం అని పవన్ నమ్ముతారు. ఆ క్రమంలోనే గోశాలలోని గో సంపదతోపాటు, వ్యవసాయ క్షేత్రంలోని ఇతర పశు సంపద, అక్కడకు చేరే పక్షుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.