తెలుగు రాష్ట్రాల్లోనూ నదులు కలుషితం.. పవన్ ఆవేదన
Send us your feedback to audioarticles@vaarta.com
గంగా నదే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం హరిద్వార్‌లోని మాత్రి ఆశ్రమంలో గంగా కాలుష్యంపై జరిగిన మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమకారుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. గంగా నది ప్రక్షాళణ కోసం ఆమరణ దీక్ష చేసి అసువులుబాసిన జి.డి అగర్వాల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పుణ్య దినాన్ని పాటించారు.
భారతదేశంలోని నదులన్నింటికీ సమస్య వచ్చి పడిందని.. తెలుగు రాష్ట్రాల్లోనూ కృష్ణ, గోదావరి, తుంగభద్ర మొదలైన నదులన్నీ పూర్తిగా కలుషితమై పోతున్నాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, గృహాల నుంచి వచ్చే వ్యర్థాలను నేరుగా నదుల్లో కలిపేస్తున్నారని, తద్వారా పర్యావరణ సమతుల్యతను గణనీయంగా నాశనం చేస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశం సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉందని, ఇక్కడి ప్రజలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని ఆయన చెప్పారు.
‘మనం ఏదైనా తప్పు చేస్తే.. అది మనపై ప్రభావం చూపుతుంది. మన పిల్లలపైనా ప్రభావం చూపుతుంది. అందుకే మనం పశ్చిమ దేశాల్లో తరహాలో.. వనరులను ఇష్టారాజ్యంగా దోచుకోము. మనం ఏదైనా తప్పు చేస్తే.. అది మన దేశ సాంస్కృతి వైభవాన్ని ధ్వంసం చేయడమే అవుతుంది’ అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏ అభివృద్ధి అయినా.. పర్యావరణ సమతుల్యతపై ఆధారపడే జరగాలని ఆయన ఆకాంక్షించారు. పర్యావరణ సమతుల్యత కోసం కట్టుబడి ఉండాలని ప్రాథమిక దశలోనే తమ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.
మరో పదేళ్లలో విశాఖకు నీటి కటకట...
దేశంలో సహజ వనరులు కలుషితమై, క్షీణించి పోతున్నాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రధాన నగరాల్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరానికి వచ్చే పదేళ్లలో తాగు నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చబోతోందని.. అక్కడ నీటిబొట్టు లభ్యమయ్యే పరిస్థితి గణనీయంగా పడిపోతోందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని నదులనూ పునరుజ్జీవింప చేస్తేనే ప్రజలను దాహార్తి నుంచి గట్టెక్కించగలమన్నారు. దేశంలోని ఏ నది నీటినైనా మనం గంగ అనే పిలుస్తామని.. గంగానదికి అంతటి ప్రాధాన్యత ఉందని.. గంగను తల్లిగా గౌరవించే సంస్కృతి దేశం నలుమూలలా ఉందన్నారు. గంగ ఉత్తర భారతానికో.. పశ్చిమ, తూర్పు ప్రాంతాలకో చెందింది కాదని.. యావద్భారతదేశానికి చెందిందని పునరుద్ఘాటించారు.
నదుల ప్రక్షాళన గంగానదితో మొదలు పెట్టి.. దేశంలోని ప్రతి నదికీ.. వాటి ఉపనదులకూ విస్తరించాలని జనసేనాని సూచించారు. గంగానది ప్రక్షాళనలో.. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలందరినీ బాధ్యులను చేస్తేనే సత్ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ దిశగా వారిలో అవగాహనను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గంగానది శుద్ధికి అనుకూలంగా నిలవడం ప్రతి భారతీయుడి బాధ్యతన్న ఆయన.. 2014 ఎన్నికల్లో తాను మద్దతిచ్చిన నరేంద్ర మోదీ.. ప్రభుత్వంలోకి రాగానే, గంగా ప్రక్షాళన చేస్తారని ఆశించానని, అయితే ఏ ప్రయోజనం కనిపించలేదన్నారు. ఈ సందర్భంగా.. ప్రొఫెసర్ శ్రీ జి.డి.అగర్వాల్‌ను పవన్ స్మరించుకున్నారు.
సహజ వనరులను ధ్వంసం చేస్తే..!
గంగానది పునరుజ్జీవనం కోసం.. ఆయన వంద రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తే.. ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని అన్నారు. నిరశన దీక్ష సందర్భంగా... ప్రొ. అగర్వాల్‌తో ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదింపులు జరిపి, ఆయన డిమాండ్లు నెరవేరుస్తారని తాను భావించానని, అయితే గంగా ప్రక్షాళనకు కట్టుబడ్డామని చెప్పుకునే ప్రభుత్వంచేసింది శూన్యమని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరులను ధ్వంసం చేస్తే.. ఉత్తరాఖండ్, నాగాలాండ్‌లలో జరిగిన ప్రకృతి వైపరీత్యమే... మిగిలిన భారతావనిలోనూ జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇవి రాతిగుండె ప్రభుత్వాలు
ప్రజా సమస్యలపై ప్రభుత్వాలతో పోరాడడం కష్టమైన పని అని పవన్ అభిప్రాయపడ్డారు. పాలకులు హృదయం లేని వారని.. వారికి తర్వాతి ఎన్నికల్లో అధికారమే పరమావధిగా మారిందని ఆక్షేపించారు. హృదయం లేని ప్రభుత్వాలతో పోరాడడం చాలా కఠినమైన కార్యమన్న ఆయన.. సమస్యల పరిష్కారానికి హింస ఎన్నటికీ మార్గం కాదన్నారు. పోరాటంలో హింస చేరితే ఆశయం వెనక్కి వెళ్లిపోతుందని.. తమది అహింసా మార్గమని స్పష్టం చేశారు.
ప్రజలను కదిలించడమే నా బలం..
నదుల ప్రక్షాళన కోసం.. ముఖ్యంగా గంగానది ప్రక్షాళన కోసం.. తనకు ఏ బాధ్యత అప్పగించినా స్థిరచిత్తంతో చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఏ సమస్యనైనా.. ప్రజల హృదయాలకు చేరువగా తీసుకు వెళ్లడమే తన బలం అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇకపై గంగానది ప్రక్షాళన ఉద్యమాన్ని.. దక్షిణాదిలోని ప్రతి కీలక నగరానికి చేరువ చేస్తానని హామీ ఇచ్చారు. గంగా నదీ పరిరక్షణ ఆందోళనకారులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలు, నిర్వహించాల్సిన పాత్రలను నిర్ణయించుకునేందుకు.. త్వరలోనే మరోమారు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే బావుంటుందని పవన్ సూచించారు. ఈ ఉద్యమంలో పాలుపంచుకునేందుకు.. ఎందరో స్వామీజీలు.. యువ బ్రహ్మచారులు, సన్యాసులు సిద్ధంగా ఉన్నారని, వారందరినీ కదిలించాలని కూడా పవన్ సూచించారు. ఈ సందర్భంగా.. గంగను కాపాడటం కోసం.. మాత్రి సదన్ నిర్వహిస్తున్న పాత్రను పవన్ ప్రశంసించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments