మంగళగిరి నుంచే రాజకీయాలు చేస్తా: పవన్
- IndiaGlitz, [Monday,March 25 2019]
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తే.. తాను అక్కడ్నుంచే బరిలోకి దిగుతానని ఒకానొక సందర్భంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమోగానీ ఒకటి కాదు రెండు స్థానాల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీకి దిగారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆదివారం అవనిగడ్డ సభలో పవన్ ఈ వ్యవహారంపై మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున...
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిలా హైదరాబాద్ లో కేసీఆర్ పక్కన కూర్చొని రాజకీయాలు చేయడానికి రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డున.. మంగళగిరిలో కూర్చొని రాజకీయాలు చేస్తున్నాం. ఎవరో చెబితే మీ పార్టీలాగా రాసుకొచ్చిన పాలసీలు కావు మావి. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల కష్టాలు తెలుసుకుని తయారు చేసిన పాలసీలు మావి. కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయాలంటే అనుభవం లేకుండా రాజకీయాల్లోకి ఎందుకు వస్తాం. ఇంట్లో కూర్చొని పబ్లిక్ పాలసీలు గురించి చదువుకున్నాను. మీలా బలాదూర్ తిరగలేదు. తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పని చేసిన రామ్మోహన్ గారిని పక్కన పెట్టుకుని పబ్లిక్ పాలసీలు గురించి నేను ఆలోచిస్తే.. మీరు ఏ2 ముద్దాయిని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నారు అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
చేతులు కట్టుకొని కూర్చుంటామా.?
పులివెందులలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. ముందు మీ సొంత చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసుకోండి. రక్తపుమరకలు, వేలిముద్రలు ఎవరు చెరిపేశారు కనుక్కోండి. సొంత ఇంట్లో హత్యజరిగితే దిక్కు మొక్కు లేదు. రేపు ముఖ్యమంత్రి అయి శాంతిభద్రతలు ఏం కాపాడుతారు. కిరాయి మూకలను తీసుకొచ్చి రాజకీయం చేస్తామని, లక్షల కోట్లు దోచేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా..? చేతులు కట్టుకొని కూర్చుంటామా.? ఏం ఎదురుతిరగలేమా..? మార్పు తీసుకురాలేమా..? తీసుకొస్తాం. బలమైన మార్పు తీసుకొస్తాం. నిరుద్యోగంపై యుద్ధం ప్రకటించి అభివృద్ధి సాధిస్తాం. పవన్ రావాలి పాలన మారాలి అంటున్నారు. అది అంత తేలికైన విషయం కాదు. దశాబ్ధాలుగా బూజు పట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే జనసేనకు ఓటు వేసి గెలిపించండి. ఇక్కడి అభ్యర్థి ముత్తంశెట్టి కృష్ణారావుని గెలిపించండి. మీ ఓటు నాకేస్తే.. నా జీవితం మీకు అంకితమిస్తాం అని పవన్ కల్యాణ్ అన్నారు.