జనసేనలోకి మంత్రి..'నో' చెప్పిన పవన్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జంపింగ్‌లు షురూ అయ్యాయి. దీంతో తమకు ఏ పార్టీలో అయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ గూటికి చేరుకోవడానికి నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు గోడదూకగా.. తాజాగా ఏపీకి సంబంధించిన ఓ మంత్రి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. 2019 ఎన్నికల్లో తానెవరితో పొత్తు పొట్టుకోనని సింగిల్‌గా పోటీ చేస్తానని అటు జగన్.. ఇటు పవన్ కుండ బద్ధలు కొట్టేశారు. అయితే ఈ విషయంలో టీడీపీ మాత్రం ఎలా ముందుకెళ్లాలి అని సమాలోచనలో చేసే పనిలో నిమగ్నమైంది.
అయితే ఈ తరుణంలో ఏపీ విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరాలని భావించారట. ఆయనన పార్టీలో చేరికకు కర్త, కర్మ, క్రియ అన్నీ నాదెండ్ల మనోహర్ అని పుకార్లు వినవస్తున్నాయి. గత కొద్దిరోజులుగా జరిగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు వెలుగుచూసింది. విశాఖలో పార్టీ శ్రేణులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో గంటాపై పవన్ కల్యాణ్ చిందులేశారు. అస్సలు గంటా లాంటి వ్యక్తి మన పార్టీలోకి అవసరం లేదన్నట్లుగా కరాఖండిగా పవన్ తేల్చేశారు.
అంత బలహీనుడినేం కాదు..!
"మంత్రి గంటా శ్రీనివాసరావును జనసేన పార్టీలోకి ఆహ్వానించేది లేదు. అంత మాత్రాన ఆయనపై నాకు కోపం ఉన్నట్లుకాదు. గంటా ఆలోచన ధోరణి జనసేనకు సరిపడదు.. గంటా లాంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి ఎగిరిపోతారు. అలాంటి పక్షులను నమ్మను. వెన్నుపోటు పొడిపించుకునేంత బలహీనుడిని కాదు. పార్టీలోకి వచ్చినా వారు దోచుకున్నదంతా ప్రజలకు పంచిపెట్టే సంస్కారవంతులు కావాలని" అని పవన్ డిమాండ్ పెట్టారు. అయితే ఇప్పటికే పార్టీలో పలువురు నేతలు జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిసందే. అయితే ఆ వ్యక్తుల ఆస్తులు సంగతేంటి..? ఏ మేరకు ప్రకటించారు..? కనీసం రాజీనామా అయినా చేశారా అన్నది ప్రశ్నార్థకమే. బహుశా ఇప్పటికే పార్టీలో చేరిన వారికి ఈ షరతు వర్తించదేమో!!
అసెంబ్లీలో అడుగుపెడతాం..!
2019 ఎన్నికల్లో పదునైన వ్యూహంతో ఏపీ అసెంబ్లీలోకి జనసేన అడుగు పెడుతుందని ఆయనకు ఆయనే జోస్యం చెప్పుకున్నారు అంతటితో ఆగని పవన్.. నీతిపరులు, అవినీతిపరులు అని విడదీసుకుంటూ పోతే రాజకీయాలు చేయలేమన్నారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఆ బురదలో దిగక తప్పదన్నారు. అయితే అందులో కమలంలా జనసేనను వికసింపజేస్తామని పవన్ డైలాగ్ పేల్చారు.
ఇంకా వారసత్వమా..!?
రాజకీయాలు అనేవి నారా లోకేశ్, వైఎస్ జగన్ వంటి వారు వారసత్వపు హక్కుగా భావిస్తున్నారని.. అయితే జనసేన మాత్రం బాధ్యతగా పరిగణిస్తుందన్నారు. రాజకీయాల్లో ఎవరో పిలిస్తే రాలేదని.. తనకు తానుగా వచ్చానని.. ముందు నుంచి చివరి వరకూ జనసైన్యం, అభిమానులు, కార్యకర్తలే అండగా ఉంటూ వస్తున్నారని ఈ సందర్భంగా పవన్ మరోసారి చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే గంటా శ్రీనివాసరావు జనసేనలోకి జంప్ అవ్వడానికి సిద్ధమైపోయారని స్పష్టంగా అర్థమవుతోంది. కాగా ఈయన సరిగ్గా ఐదేళ్ల పాటు ఏ పార్టీలోనూ నిలకడగా ఉన్న దాఖలాల్లేవ్. పైగా ఈయన ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీ అధికారంలోకి రావడం పక్కాగా మంత్రి పదవి దక్కించుకోవడం అనేది కాంగ్రెస్ హయాం నుంచి గంటాకు బాగా కలిసిస్తోంది. అయితే జనసేనలో చేరడానికి సిద్ధమైన గంటా నిజంగానే జంప్ అవుతారా..? లేకుంటే వైసీపీ కండువా కప్పుకుంటారా అనేది తెలియాలంటే గంటా నుంచి గంట మోగాల్సిందే.. క్లారిటీ రావాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout