Pawan Kalyan:తండ్రి లేని పిల్లాడని జగన్‌ని గెలిపించారు , కానీ ఈసారి అక్కడ గెలుపు మనదే: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలిలో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని ఆకాంక్షించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ నేతలతో పవన్ , పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మనోహర్ తన హయాంలో చేసిన సేవలను తెనాలి నియోజకవర్గ ప్రజలు విస్మరించలేదున్నారు. ఇప్పటికీ నియోజకవర్గ అభ్యున్నతి కోసం ఆయన పరితపిస్తారని పవన్ ప్రశంసించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో తెనాలికి ఆయన అవసరం వుందని.. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో స్పీకర్‌గా అసెంబ్లీని ఆయన ఎంతో సమర్ధవంతంగా నడిపారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు.. నేను బాగుండాలి , నేనే బాగుపడిపోవాలి అనేది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిని తానెప్పుడో గ్రహించానని, అందుకే వైసీపీని వ్యతిరేకిస్తున్నానని పవన్ వెల్లడించారు. తండ్రి లేని పిల్లాడు, సంవత్సరం నుంచి నడుస్తున్నాడని ప్రజలు జాలితో ఓట్లు వేసి.. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు.
విభజన తాలూకు ఇబ్బందులు అలాగే వున్నాయి :
ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంపై జనసేన నిబద్ధతతో నిలబడి వుందని పవన్ తెలిపారు. తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసినా.. ఇక్కడ మాట్లాడినా విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఎలా అభివృద్ధి వైపు వెళ్లాలనే దానిపై మాట్లాడుతానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చెత్తపైనా పన్ను వేసిందని.. ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వేస్తూ ఆ డబ్బుతో సంక్షేమం అంటే ఎలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఓ పద్ధతి లేకుండా చేస్తున్న వైసీపీ పాలన వల్ల రాష్ట్రం పది అడుగులు వెనక్కి వెళ్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ పాలనాపరమైన ఇబ్బందులు అలాగే వున్నాయని.. మన వ్యవస్థ ఇప్పటికీ సర్దుబాటు కాలేదన్నారు.
ఓటర్ల జాబితాను తనిఖీ చేయండి : నాదెండ్ల
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పార్టీలోని నేతలంతా అరమరికలు లేకుండా అందరినీ కలుపుకుని వెళ్లేలా పనిచేయాలన్నారు. ప్రస్తుతం కొత్త ఓట్ల చేర్పులు, మార్పులు జరుగుతున్నాయని.. ప్రతి ఒక్కూ నియోజకవర్గాల్లో ఓట్లను తనిఖీ చేయాలని నాదెండ్ల కోరారు. తెనాలి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా వున్న సమయంలో జరిగిన అభివృద్ధిని అందరూ గుర్తు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. తెనాలి నుంచి గెలిచి జనసేన ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేస్తామో ప్రజలకు తెలియజేద్దామని మనోహర్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments