Pawan Kalyan:ఇట్స్ క్లియర్ .. ఈసారి పొత్తులతోనే బరిలోకి, సీట్లేస్తేనే ‘‘సీఎం సీటు’’పై తేల్చుకుంటా : క్లారిటీ ఇచ్చేసిన పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
కొద్దిరోజులుగా చప్పగా వున్న ఏపీ రాజకీయాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో యాక్టీవ్‌గా మారాయి. అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను పరామర్శించి, వారిలో ధైర్యం నింపేందుకు పవన్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. సీఎం పదవి వరించి రావాలి కానీ.. కోరుకుంటే రాదంటూ నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా ఈరోజు మరోసారి పొత్తులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తానని.. త్రిముఖ పోరుతో జనసేనను బలి చేసేందుకు తాను సిద్ధంగా లేనంటూ కుండబద్ధలు కొట్టేశారు. ఎన్నికల్లో గెలిచే స్థానాలను బట్టి సీఎం పదవి గురించి మాట్లాడదామని పవన్ తెలిపారు. అన్ని పద్ధతులు బాగుండి.. అంతా గౌరవంగా వుంటే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకుంటాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బలమైన మెజార్టీ వస్తేనే మాట్లాడటానికి వీలుంటుందని పవన్ తెలిపారు.
చంద్రబాబు మోసం చేయడానికి నేనేం పిల్లాడిని కాదు :
ప్రస్తుతం వైసీపీకే జనసేన ప్రధాన ప్రత్యర్ధి అని ఆయన స్పష్టం చేశారు. ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని దించడమే మన కర్తవ్యమని పవన్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పొత్తుల వల్ల పార్టీ ఎదుగుతుందని.. దానిని తక్కువగా చూడొద్దని ఆయన పేర్కొన్నారు. తక్కువ స్థానాలు గెలుచుకుంటూ వచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా ఎదిగిందని పవన్ గుర్తుచేశారు. డిసెంబర్‌లో ఎన్నికలు వుంటాయని ప్రచారం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో జూన్ నుంచి తాను ప్రచారం మొదలుపెడతానని పవన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు తనను మోసం చేస్తాడని అంతా అంటున్నారని.. అయితే తాను మోసపోవడానికి చిన్నపిల్లాడిని కాదన్నారు. ఏ వ్యూహం లేకుండానే పార్టీ పెట్టేసి, రాజకీయాల్లోకి వస్తామా అని పవన్ ప్రశ్నించారు.
ఎన్టీఆర్‌కు కుదిరిందేమో నేను కలలోనూ ఊహించలేను :
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు రాష్ట్రంలో ఇన్ని పార్టీలు లేవని.. కాంగ్రెస్ ఒక్కటే వుండేదని ఆయన గుర్తుచేశారు. అప్పుడున్న పరిస్థితులు .. మనుషులు వేరని పర్వతనేని ఉపేంద్ర, నాదెండ్ల భాస్కర్ రావు, ఎన్జీ రంగా వంటి నేతలు ఎన్టీఆర్‌కు దిశానిర్దేశం చేశారని ఆయన పేర్కొన్నారు. డబ్బు, పగ, ప్రతీకారాలు అప్పట్లో లేవని పవన్ తెలిపారు. పాపులారిటీ వుంటే సీఎం అవుదామంటే ఇప్పుడున్న పరిస్ధితుల్లో వీలుకాదని.. అది ఎన్టీఆర్‌కు కుదిరిందేమో కానీ, తాను అలాంటిది కలలో కూడా ఊహించలేనని జనసేనాని పేర్కొన్నారు. రాష్ట్రం బాగుకోసం కొందరికి శత్రువుగా మారడానికి కూడా తాను సిద్ధమని పవన్ తెలిపారు. తనను ఎన్ని మాటలు అంటే అంత రాటు తేలుతానని ఆయన వెల్లడించారు. బెజవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు జనసేనకు 25 శాతం ఓటు బ్యాంక్ వుందని పవన్ తెలిపారు. సగటున పార్టీ ఓటింగ్ శాతం 18 శాతమైతే.. గోదావరి జిల్లాల్లో 36 శాతమని పవన్ అన్నారు.
ప్రజాదరణను ఓట్లుగా మార్చుకోలేకపోతున్నాం:
ప్రజాదరణ ఉండి కూడా దానిని ఓట్లుగా మలచుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చినన్ని సీట్లు కూడా రాలేదన్నారు. ఏడు ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ సీటుతో ఎంఐఎం దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు. ఎంఐఎం లాగా, కనీసం విజయ్ కాంత్ పార్టీ లాగా కూడా జనసేనను గౌరవించలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం తాను మాటలు పడుతున్నానని.. కష్టాలున్నప్పుడే పవన్ గుర్తొస్తున్నాడని, ఎన్నికలప్పుడు రావడం లేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments