Pawan Kalyan:ఇకపై నో హైదరాబాద్.. అంతా మంగళగిరి నుంచే , జనసేన కేంద్ర కార్యాలయ నిర్మాణానికి పవన్ భూమి పూజ
Send us your feedback to audioarticles@vaarta.com
మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. అనంతరం భూమాత ప్రీత్యర్థం నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను వేద పండితుల పర్యవేక్షణలో చేపట్టారు.
కాగా.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలు ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచి సాగుతున్నాయి. అయితే ఇకపై మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. దీనిలో భాగంగానే కేంద్ర కార్యాలయ భవనానికి ఆయన ఈరోజు భూమి పూజ నిర్వహించారు. కార్యాలయ నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ నిపుణులకు పవన్ సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మపరిరక్షణ, ప్రజా క్షేమమే లక్ష్యం :
అంతకుముందు ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ తలపెట్టిన యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు పవన్ కల్యాణ్. సోమవారం ఉదయం 6.55 నిమిషాలకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించి యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అప్లైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
రేపు కూడా కొనసాగనున్న యాగం :
యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి.. శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అఫ్లైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత, త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదుగురు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా సోమవారం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
జనసేన కార్యాలయం వద్ద ఆధ్యాత్మిక శోభ:
ఇకపోతే.. మంగళగిరి జనసేన కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. అక్కడ సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది. ఈ యాగంలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రానికే పవన్ కళ్యాణ్ యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతనను కలిగిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments