హార్వర్డ్ యూనివర్శిటీలో పవన్ కీలకోపన్యాసం

  • IndiaGlitz, [Monday,February 13 2017]

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన అమెరికా పర్యటనలో చిట్టచివరిదీ… కీలకమైన ప్రసంగంతో మరోసారి ఆకట్టుకున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ ప్రసంగించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ భారత కాలమానం ప్రకారం… సోమవారం ఉదయం 4 గంటలకు హార్వర్డ్ లో కీలకోపన్యాసం (కీ నోట్ అడ్రస్) చేశారు. సుమారు గంటసేపు ఆంగ్లంలో సాగిన ప్రసంగంలో భారతదేశ రాజకీయాలు, సామాజిక స్థితిగతులు, జనసేన దృక్పథం వంటి పలు అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రజల నడుమ ప్రాంతీయ వైరుధ్యాలు లేకుండా అంతా ఒక్కటేనన్న భావన పెరిగితేనే భారత్ ప్రగతి ప్రవర్థమానమవుతుందని చెప్పారు. కొద్దిసేపు సభికులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.

హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రసంగం అంటే చిన్న విషయం కాదు. అందుకే… నాకు ఆహ్వానం అందినప్పడు కాస్త ఆలోచించాను. కొంత సమయం తీసుకున్నాకే ఇక్కడికి రావడానికి అంగీకరించాను. ఈరోజు ఇండియా ఈజ్ రైజింగ్ గ్లోబల్ పవర్' అనే అంశంపై నేను ప్రసంగించాల్సి ఉంది. నాకున్న అనుభవం మేరకు మొత్తం భారతదేశం గురించి చెప్పలేనేమో గానీ… ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యక్తిగా ఆ ప్రాంతాల దృక్కోణం నుంచి నా ఆలోచనలు మీతో పంచుకుంటాను.

ఐక్యతే మన శక్తి

భారతదేశంలో విభిన్న మతాలు, సంస్కృతులు ఉన్నాయి. ప్రజలందరికీ దేశంపై ప్రేమ ఉంది. కానీ మనమంతా ఒక్కటే అన్న భావన మరింత పెరగాల్సి ఉంది. ఉదాహరణకు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఉత్తరాది గురించి… ఉత్తర భారతదేశంలోని వారికి దక్షిణ ప్రాంత ప్రజల గురించి పెద్దగా తెలియని స్థితి. వాళ్లు వేరు… మనం వేరన్న భావనలు. దేశ ప్రజాప్రతినిధులదీ ఇదే తీరు. ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులు ఈ పరిస్థితిపై దృష్టి సారించాల్సి ఉంది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో గాంధీజీ దేశమంతా పర్యటించారు. కానీ ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఎంత మందికి ఇండియా మొత్తం తెలుసు? మన నాయకుల్లో మార్పు రావాలి. భిన్న సంప్రదాయాలున్నప్పటికీ, జనమంతా ఒక్కటే అన్న భావనతో వివక్ష రహితంగా వ్యవహరించాల్సి ఉంది. భిన్న సంస్కృతుల ప్రజలు ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అంతా ఒక్కటే అనే భావనలు పరిఢవిల్లాలి. సాంస్కృతిక సమగ్రత (కల్చరల్ ఇంటెగ్రిటీ) పెరగాలి. దేశ ప్రజల్లో ఇలాంటి ఐక్య భావన ప్రోది చేస్తేనే ఇండియా ప్రపంచశక్తిగా మరింత ముందంజ వేయగలదు. నాయకులు సమాజాన్ని విభజించి పాలించే ధోరణితో వ్యవహరిస్తుండడం వల్ల జరుగుతున్న నష్టాలను చూసి తట్టుకోలేకపోయాను. వాటిని ప్రతిఘటించడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను.

అభివృద్ధి వెంటే అలసత్వం…

భారతదేశం అభివృద్ధి చెందుతోంది. కానీ దాని ఫలాలు మాత్రం ఏ కొద్దిమందికో అందుతున్నాయి. ఇంకా ఎన్నో సమస్యలు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఒక ఉదాహరణ ప్రస్తావిస్తాను. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ గత 20 ఏళ్లలో 20 వేల మందికి పైగా కిడ్నీ వ్యాధులతో మరణించారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ పక్షాలు, ప్రజాప్రతినిధులు కూడా ఉదాసీనంగా వ్యవహరించారు. ఈ సమస్య గురించి నాకు తెలిశాక, ఉండబట్టలేక ఆ ప్రాంతాన్ని సందర్శించాను. బాధితులతో మాట్లాడాను. ఏదో ఒకటి చేయండని ప్రభుత్వాలను కోరాను. ఎట్టకేలకు యంత్రాంగం స్పందించి కొన్ని చర్యలు ప్రారంభించింది. ఇలాగే మరెన్నో సమస్యలు నాయకుల ఉదాసీనత కారణంగా పరిష్కారం కాకుండా పెరిగి పెద్దవైపోతున్నాయి.

ఎదిరించే తత్వమేదీ?

ఇండియాలో మరో సమస్య… ఉదాసీన సమాజం. పక్కవాడికి అన్యాయం జరిగితే ప్రశ్నించి, ఎదిరించే తత్వం కొరవడింది. ఏదో చేయాలన్న తలంపు, ఆలోచనలు ఉన్నా… అవి కేవలం సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఒకరు చేసేది తప్పని చెప్పడం సులువే. కానీ ఆయా సమస్యలు, సామాజిక రుగ్మతలపై వాస్తవంగా పోరాటానికి ముందుకొస్తున్నది ఎంతమంది? నా వరకు నేను భావితరాల కోసం శక్తి మేరకు సాధ్యమైనంత చేయాలనే తలంపుతో ఉన్నాను.

భారతదేశం వేదభూమి. సత్య, ధర్మాలకు ప్రతీక. హిమాలయాలు సహా ఎన్నో చారిత్రక వైభవాల నిలయం. మేం అందరినీ ప్రేమిస్తాం… ఎవరికీ భయపడం. అందరినీ గౌరవిస్తాం. కానీ ఎవరికీ లొంగం. భారత్ మాతాకీ జై'… అంటూ ప్రసంగాన్ని ముగించారు.

హామీల నుంచి ఎందుకు వెనక్కి తగ్గారు?

పవన్ ప్రసంగం పూర్తయ్యాక సభికుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రత్యేక హోదాపై సమాధానమిస్తూ… ప్రస్తుత పాలకులు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చాల్సిందే. ఈ హామీ నుంచి ఎందుకు వెనక్కి తగ్గారో వారు ప్రజలకు జవాబివ్వాలి. అధికారంలో ఉండీ జవాబుదారీతనం లేకుండా… బాధ్యతారాహిత్యంగా, ఉదాసీనంగా ఉంటే ఊరుకోం. వారు అలా ఉన్నందునే మేం పోరాడుతున్నాం' అన్నారు పవన్. కర్షకుల కష్టాలు, ఆత్మహత్యల నివారణపై మాట్లాడుతూ… రైతుల్లో ముందు ఆశావహ దృక్పథం పెంచాలి. స్వయం సహాయక సంఘాల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా వారిలో పరస్పర సహకార భావాన్ని పెంచితే సత్ఫలితాలుంటాయి' అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

విద్యార్థుల్లో హర్షాతిరేకాలు

పవన్ ప్రసంగం ఆద్యంతం కరతాళ ధ్వనులతో తమ సంఘీభావాన్ని వ్యక్తం చేసిన విద్యార్థులు తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పవన్ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా సాగిందని వారు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం, మాతృదేశం కోసం ముందుకు వచ్చే ప్రవాస భారతీయులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పడం ఉత్సాహం నింపిందని ఒక విద్యార్థి అన్నారు. తమ వంతుగా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారాయన. మరో యువతి మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ ప్రసంగం విన్నాక… ఇన్నేళ్లు ఇక్కడెందుకు ఉండిపోయానా అనిపిస్తోందని, తక్షణం ఇండియా వెళ్లి ప్రజలకు ఏదైనా చేయాలనిపిస్తోందని అన్నారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ… పవన్ ఇన్నాళ్లు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదా అనిపించింది. ఇప్పటికైనా మించి పోయింది లేదు. ఆయనలో నిజాయితీ, మంచి భావాలున్నాయి. మేమంతా వెన్నంటి ఉంటాం' అన్నారు.

మొత్తం మీద పవన్ కల్యాణ్ తన అయిదు రోజుల పర్యటనను ఫలవంతంగా పూర్తి చేసుకున్నారు. పార్టీ అభిమానులను కూడగట్టుకోవడానికి, ప్రవాసులు, అమెరికాలోని విభిన్న నిపుణుల నుంచి ఎంతో కొంత నేర్చుకోవడానికి ఆయన తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అమెరికా పర్యటన ముగియడంతో పవన్ మంగళవారానికల్లా హైదరాబాద్ వచ్చేస్తారు. వచ్చే వారం … ఈ నెల 20వ తేదీన మంగళగిరిలో చేనేత గర్జన సభకు పవన్ సన్నద్ధం కానున్నారు.

More News

ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న సునీల్ - శంకర్ ల సినిమా!

సునీల్ కథానాయకుడిగా ఎన్.శంకర్ దర్శకత్వంలో మలయాళం హిట్ సినిమా "2కంట్రీస్"కు

రాజ్ విరాట్, కిషోర్, గ్రేస్...'బీప్' షార్ట్ ఫిల్మ్ కు అద్భుతమైన స్పందన

కిషోర్ మారిశెట్టి, గ్రేస్ జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ బీప్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది ఈ లఘు చిత్ర ట్రైలర్. చాలా చిత్రాలను తలదన్నే రీతిలో కట్ చేసిన ఈ ట్రైలర్ కు వస్తున్న స్పందనతో పూర్తి సినిమా ఎప్పుడు వస్తుందా అనే అంచనాలు భారీగా పెరిగాయి. అందరి అంచనాలకు ఫుల్ స్టాప్ పెడుతూ...

ప్రేమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే 'వైశాఖం'

ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, లవ్లీ వంటి లవ్స్టోరీస్ని అందించిన ఆర్.జె.సినిమాస్ బేనర్ నుంచి మరో ప్రేమకథా చిత్రం 'వైశాఖం' వస్తోంది. హరీష్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీడైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

ప్రభాస్,యు.వి.క్రియోషన్స్, సుజిత్ చిత్రం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ,సుజిత్ (రన్ రాజా రన్ ఫేం)కాంబినేషన్ లో,వరుస విజయాలతో దూసుకుపోతున్న యు.వి.క్రియోషన్స్

'స్టార్ మా' లోగో ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి

దేశంలోనే అగ్రశ్రేణి మీడియా సంస్థంగా పేరు పొందిన స్టార్ ఇండియా తన పోర్ట్ పోలియో ఛానెల్ మా టీవీ..