Pawan Kalyan:సీఎం పదవిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం పదవిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పొత్తులో భాగంగా మనం నిలబడ్డ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిపించి.. మద్దతు ఇచ్చిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అప్పుడు ముఖ్యమంత్రి స్థానం గురించి ఆలోచిద్దామన్నారు. తాను, చంద్రబాబు కూర్చొని సీఎం ఎవరో నిర్ణయిస్తామన్నారు. తాను జనసేనను ఏ పార్టీలో కలపనని.. బతికినా, మరణించినా పార్టీ ఎక్కడకూ వెళ్లదన్నారు. అభిమానం, ప్రేమ ఓట్ల రూపంలో బదిలీ కాకుంటే మీరిచ్చే నినాదాలు సాధ్యం కాదన్నారు. నినాదాలు.. చప్పట్లు కాదు.. మీ అభిమానం ఓట్లుగా మారాలని పిలుపునిచ్చారు.
పొత్తు తప్ప మరోదారి లేదు..
పొత్తును విడగొట్టాలని కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశంకు బీ పార్టీ అంటూ కామెంట్లు చేస్తున్నారని.. వాటిని మీరు పట్టించుకోకండని పేర్కొన్నారు. తెలుగుదేశం వెనుక జనసేన నడవడం లేదని.. కలిసి నడుస్తున్నామన్నారు. అభిమానులు, జనసైనికుల ఆత్మగౌరవాన్ని తక్కువ చేయనన్న పవన్.. ఆత్మగౌరవాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు. ఏపీ భవిష్యత్ బాగుండాలంటే పొత్తు తప్ప మరోదారి లేదన్నారు. ఒంటరిగా బరిలోకి దిగితే తప్పనిసరిగా జనసేన ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. అయితే ఆ బలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం సరిపోదని.. అందుకే యువత భవిష్యత్ కోసం ఆ అవకాశాన్ని తీసుకోదలచుకోలేదని స్పష్టం చేశారు. 2014లో రాష్ట్రం అభివృద్ధికి చెందాలని టీడీపీకి మద్దతు ఇచ్చానని.. కానీ దురదృష్టవశాత్తు 2019లో మాత్రం అది కుదరలేదన్నారు. ఈసారి మాత్రం ఏపీ భవిష్యత్ బంగారుమయం చేయాలన్నారు.
రాజధానికి దారేది..
విభజన జరిగి పదేళ్లవుతున్నా ఏపీలో ‘అత్తారింటికి దారేదిలా.. రాజధానికి దారేది అన్నట్టుంది’ అన్నారు. కేంద్రం గుర్తిస్తే తప్ప మనకు రాజధాని ఏది తెలియని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర తనకు ఇష్టమైన ప్రాంతమని.. ఇక్కడ వలసలు ఆగాలని.. తాను భావితరాల భవిష్యత్ ఆలోచిస్తున్నానన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల గౌరవమని.. ప్రైవేటీకరణపై కేంద్రం పెద్దలతో మాట్లానని.. తాను మాట్లాడిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రైవేటీకరణ ఆపారని గుర్తుచేశారు. ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని.. బీజేపీలో చేరితే కోరుకున్న పదవి లభిస్తుందన్నారు. ఐదేళ్లు నుంచి అధికార మదంతో ఏపీని పట్టి పీడిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి విముక్తి చేయడమే తన లక్ష్యమని జనసేనాని వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments