Pawan Kalyan:పవన్ కల్యాణ్‌పై 'కాపు' అస్త్రం.. వైసీపీ ప్రత్యేక వ్యూహం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయం దగ్గర పడటంతో రోజుకొక్క కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. టీడీపీ-జనసేన కలిసికట్టుగా దూసుకెళ్తుండటంతో ఆ పార్టీలకు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ కూడా వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్‌ను దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముళ్లును ముళ్లుతోనే తీయాలి అనే సామెతను ఉపయోగించేందుకు రెడీ అయింది. అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్‌ను కాపు పెద్దల చేతిలోనే ఓడించాలని కంకణం కట్టుకుంది.
ఇటీవల జరిగిన జెండా సభలో పవన్ కల్యాణ్.. కాపు పెద్దలను పరోక్షంగా ఉద్దేశిస్తూ తనకు ఎవరూ సలహాలు, సూచనలు ఇవ్వొద్దని గట్టిగా చెప్పారు. దీంతో హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వెంటనే లేఖలు సంధిస్తూ పవన్ తీరును ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వీరిని ఆకర్షించేందుకు వైసీపీ పెద్దలు మంతనాలు జరిపారు. వారి మంతనాలు ఫలించడంతో జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అలాగే ఇప్పుడు ముద్రగడ కుటుంబంపై దృష్టి పెట్టారు. దీంతో ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాల నేపథ్యంలో ముద్రగడను పోటీలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పిఠాపురం ఇంఛార్జిగా వంగా గీతాను తాడేపల్లికి పిలిపించుకుని సీఎంవో కార్యాలయం మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమెను వేరే నియోజకవర్గానికి మార్చనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడు గిరిని పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పవన్‌ను ఎలాగైనా ఓడించి తీరాలని వైసీపీ పెద్దలు పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు.
వైసీపీ పెద్దల వ్యూహాలను పసిగట్టిన పవన్ కల్యాణ్.. ప్లాన్ ప్రకారమే తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించడం లేదు. తొలుత భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమని భావించారు. దీంతో వైసీపీ నేతలు అలర్ట్ అవ్వడంతో పవన్ తన వ్యూహాన్ని మార్చారు. తాజాగా పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయంటూ లీకులు ఇచ్చారు. దాంతో ముద్రగడను పార్టీలోకి తీసుకుని అక్కడి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఇప్పుడు గాజువాక లేదా తిరుపతి నుంచి జనసేనాని పోటీ చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. మొత్తానికి ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని డిసైడ్ అయిన పవన్.. అందుకు తగ్గట్లు అడుగులు వేస్తున్నారు. అధికార వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా వీలైనంత ఆలస్యంగా తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటించాలని భావిస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout