శ్రీవారి ఆస్తులను నిరర్థకం అనడం అవమానించడమే : పవన్

దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భక్తులు తిరుమల వెంకన్న ఆస్తులు సమర్పించుకున్నారని.. వారు ఎంతో భక్తితో ఇచ్చిన ఆస్తికి నిరర్థకం అనే ప్రశ్నే ఉండకూడదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. టీటీడీ భూముల వ్యవహారంపై సోమవారం నాడు స్పందించిన ఆయన.. ఆ రోజు దాత ఇచ్చిన ఉద్దేశం స్వామి వారి ఆలయ నిర్వహణ, ధర్మ ప్రచారం, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించాలన్నారు. స్వామి వారికి ఎందరో భక్తులు చిన్నపాటి ఇళ్ల జాగాలు, కొద్దిపాటి విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములు, భవనాలు ఇచ్చారని.. వాటిని చిన్నవిగా చూడటం, నిరర్థకం అనడం అంటే ఇచ్చిన దాతను అవమానించడమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రోజన దాత ఉద్దేశం భగవంతుని సేవకు, హిందూ ధర్మ ప్రచారం కోసం, ఆలయం చేస్తున్న ధార్మిక, సేవ కార్యక్రమాల కోసం ఈ ఆస్తిని సమర్పించుకోవడమేనని.. అంతే తప్ప అమ్మి సొమ్ముగా మార్చమని కాదని పవన్ హితవు పలికారు.

అమ్మేస్తాం అనడం భావ్యం కాదు..!

‘ఆశ్రమాలు, పీఠాలకు కూడా భక్తులు ఎక్కడెక్కడి ఆస్తులు దానం చేస్తుంటారు. ఆశ్రమాలు, పీఠాలు ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులను సైతం జాగ్రత్తగా కాపాడుకొంటూ ఉంటాయి. అలాంటిది ఆస్తుల సంరక్షణ కోసం ‘ఎస్టేట్’ విభాగం కూడా కలిగిన టి.టి.డి. ఎందుకు వేలం వైపు వెళ్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఆలయ నిర్వహణకు నిధులు కొరత అనేది ఎన్నడూ లేదు. టి.టి.డి. డిపాజిట్లపై వచ్చే వడ్డీలతోనే చాలా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అలాగే నిత్యాన్నదాన పథకం లాంటి వాటికి వేర్వేరుగా విరాళాలు భక్తులు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి పథకాల నిర్వహణకు నిధుల సమస్య ఉండదు. పొరుగు రాష్ట్రాల్లో నిర్వహణ సాధ్యం కావడం లేదు అనేది మాట కూడా విశ్వసనీయంగా లేదు. ఇరుగుపొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణాల్లో టి.టి.డి. కార్యాలయాలు ఉన్నాయి. బోర్డుకి సంబంధించిన ధర్మ ప్రచార పరిషత్తులు పని చేస్తున్నాయి. అలాగే మహారాష్ట్ర, ఒడిశాల్లో కూడా టి.టి.డి. సభ్యులు, ధర్మ ప్రచారాలు చేసేవారు ఉన్నారు. అలాంటి చోట తగిన పర్యవేక్షణతో స్వామి వారి ఆస్తులను కాపాడుకొనే ప్రణాళికలు చేయాలి తప్ప అమ్మేస్తాం అనడం భావ్యం కాదు’ అని పవన్ చెప్పుకొచ్చారు.

ఆస్తులను అంగట్లోపెట్టేస్తారా..!?

‘ఉన్న ఆస్తులను కాపాడుతూ... వాటిని సద్వినియోగం చేసి అద్దెలు/కౌలు రూపంలో ఆదాయం పొందేందుకు తగిన మార్గాలు రూపొందించాలి. లీగల్ వివాదాలు లేకుండా పర్యవేక్షించాలి. భవనాలు ఇస్తే వాటిని టి.టి.డి. ధార్మిక కార్యక్రమాలకు, ధర్మ ప్రచారానికి వినియోగించుకోవాలి. అంతే తప్ప అయినకాడికి అమ్మేస్తాం అనడం అంటే దేవుడి ఆస్తులను ఉప్పుగల్లుకి ఎవరికో కట్టబెట్టే కుట్రకు రంగం సిద్దం చేస్తున్నట్లే అనిపిస్తోంది. ఈ రోజు తిరుమల శ్రీవారి ఆస్తులు అమ్మడం మొదలుపెట్టాక.. వరుసగా రాష్ట్రంలోని ఇతర దేవాలయాల ఆస్తులను అంగట్లోపెట్టేస్తారా?’ అంటూ పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.