రెండు సీట్లను ప్రకటించిన జనసేన.. చంద్రబాబుపై పవన్ కీలక వ్యాఖ్యలు
- IndiaGlitz, [Friday,January 26 2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేసే రెండు అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని వెల్లడించారు. జనసేన నేతలతో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు మండపేట, అరుకు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై ఆయన స్పందించారు. చంద్రబాబుకు ఉన్నట్టే తనకూ పార్టీ లీడర్ల నుంచి ఒత్తిడి ఉందని... అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రెండు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పవన్ వెల్లడించారు.
పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదని.. కానీ చేశారని తెలిపారు. అందుకు పార్టీ నేతలకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. టీడీపీ సీట్లు ప్రకటించడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసిందని చెప్పుకొచ్చారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని. కొంతమంది 50 తీసుకోండి.. 60 తీసుకోండని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తనకు ఏమి తెలియదని చాలా మంది మాట్లాడుతున్నారని.. ఇవేమీ తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చాను అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో 18 లక్షల ఓట్లు సంపాదించామని.. ఇప్పుడు ఆ శాతం పెరిగిందన్నారు. కానీ సింగిల్‌గా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయో తెలియదని చెప్పారు.
అలాగే ఇటీవల నారా లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా తాను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మౌనంగా ఉంటున్నానని వ్యాఖ్యానించారు. సీనియర్ నేతగా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయన్నారు. పొత్తులు సీట్లు సర్దుబాటు అంటే వాళ్లకు ఇరుకు చొక్కా తొడుక్కున్నట్టు ఉంటుందన్నారు. వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. దయచేసి పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నానని వివరించారు. సొంత చెల్లినే వదలని జగన్ మనల్ని వదులుతాడా? అని ప్రశ్నించారు. అందుకే జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదని.. అదే తన లక్ష్యమన్నారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టమని.. కానీ విడదీయం చాలా తేలికని పవన్ పేర్కొన్నారు.