అర్జెంట్‌గా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన లేదు: పవన్
- IndiaGlitz, [Wednesday,July 31 2019]
జనసేన పార్టీకి వచ్చిన ప్రతి ఓటు నాలుగు ఓట్లతో సమానమనీ, అది ప్రతికూల పరిస్థితుల్లో డబ్బుకీ, సారాకీ లొంగకుండా వేసిన ఓటు అని జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీకి వేసిన ప్రతి ఓటుకి తన చివరిశ్వాస వరకు నిలబడతానని, అండగా ఉంటానని తెలిపారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటే వ్యక్తిగత అజెండాలు వదిలేయాలి. అందరికీ నేను కావాలి. పని మాత్రం వ్యక్తిగత అజెండాలతో చేస్తారు. మీరు కాదు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లండి. ఒక వ్యవస్థను పూర్తి స్థాయిలో నడిపించేందుకు సమయం పడుతుంది. ఆ విషయం నాకు తెలుసు. నేను స్థిరంగా, బలంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తా. ఆఖరిశ్వాస వరకు ముందుకు తీసుకువెళ్తాం. నాకు అర్జెంట్‌గా ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. నేను కేవలం రాష్ట్రం బాగుండాలి అని మాత్రమే కోరుకునే వాడిని. రాష్ట్రం ఏమైపోతుందోనన్న భయంతోనే పార్టీ పెట్టా. తప్పు జరిగినప్పుడు దాని గురించి మాట్లాడడానికి కూడా అందరికీ భయం వచ్చేసింది. కొత్త ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే హర్షిస్తాం పవన్ చెప్పుకొచ్చారు.
చూస్తూ ఊరుకోం!
ప్రజలను ఇబ్బందులు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. నేను మొదటి రోజే చెప్పాను. కొత్త ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇద్దాం అని ఆ తర్వాత తప్పులు ఉంటే ప్రశ్నిద్దాం అని. ఉదయం మార్గం మధ్యలో భవన నిర్మాణ కార్మికులు వారి సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. 100 రోజులు మాట్లాడరాదని నిర్ణయించుకున్నా, వారి కష్టాలు నన్ను కదిలించాయి. వారు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి లెటర్ రాశాం. గతంలో రైతులు విత్తనాల కొరతతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక లేఖ రాశాం. ఇది రెండోది. రాష్ట్రంలో ఇంకా సమస్యలు ఉన్నాయి. కరెంటు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుదరుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. అప్పటికీ పరిస్థితులు మారకపోతే నేను మాట్లాడడానికైనా, విమర్శించడానికైనా, అవసరం అయితే ప్రజల తరఫున రోడ్డు మీదకి వచ్చి కొట్లాడడానికి అయినా సిద్ధం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. కార్యకర్తలకు ఇబ్బందులు వస్తే నాయకులు ముందు మీరు నిలబడండి. ముందుగా డిజిపికి, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి చెబుదాం. వారు సరిచేయకపోతే ఏ ఒక్క జనసైనికుడికి గాయం అయినా నేను వస్తాను అని పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు.