సైనిక్ బోర్డుకు కోటి విరాళమిచ్చిన తొలి భారతీయుడిగా పవన్!
- IndiaGlitz, [Thursday,February 20 2020]
దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్! మన దేశంలో ఉన్న ప్రజలను కాపాడేందుకు మట్టిలో సైతం కలిసేందుకు సిద్ధమయ్యేవాడు ఒక్క సైనికుడే! మన సంరక్షణ కోసం రక్షణ కవచం లేకుండా పోరాడే వాడు ఒక్క సైనికుడే! కుటుంబానికి దూరంగా ఉండి మనం కుటుంబంతో కలిసుండేందుకు కృషి చేసేవాడు సైనికుడొక్కడే! అటువంటి సైనికుడి కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. భారతదేశ రక్షణ కొరకు విధి నిర్వహణలో చనిపోయిన సైనికుల కుటుంబాలను కేంద్రీయ సైనిక్ బోర్డు ఆదుకుంటుంది. త్రివిధ దళాలలో పనిచేసే ప్రతి ఒక్క సైనికుడి కుటుంబానికి కేంద్రీయ సైనికి బోర్డు అండగా నిలబడుతుంది. ఇందుకొరకు కావాల్సిన నిధులను ప్రజల వద్ద నుండి విరాళాల రూపంలో సేకరిస్తుంది.
నంబర్ వన్ పవన్‌దే!
ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవంగా జరుపుకుంటాము. మన దేశం కోసం సాయుధ దళాల సైనికులు చేస్తున్న కృషిని ఆరోజున మనం మరొకసారి గుర్తుచేసుకుంటాం. సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం సైనిక కుటుంబాల సంరక్షణ, సంక్షేమం. దేశం మీద నిత్యం ప్రేమను చాటుకునే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. దేశం పట్ల తనకున్న బాధ్యతను నిర్వర్తించారు. సైనిక్ బోర్డుకు కోటి రూపాయల విరాళం అందజేసిన తొలి భారతీయుడిగా నిలిచారు. డిసెంబర్ 7న చెప్పినట్లుగానే ఈరోజు సైనిక్ బోర్డును పవన్ సందర్శించి నిర్వాహుకులకు కోటి రూపాయల చెక్కును అందజేశారు. అంతే కాకుండా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడు సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం అనంతరం.. విజ్ఞాన భవన్లో జరిగిన ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ పాల్గొన్నారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని పవన్ కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.