‘సీఎం పదవికి పవన్ అన్ని విధాలా అర్హులు..’

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

కేంద్రంలో బీఎస్పీ కూట‌మి ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామ‌ని, కేంద్ర ప‌రిధిలోని విభ‌జ‌న హామీల‌న్నీ ప‌రిష్కరిస్తామ‌ని బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీల్లా వెనక‌డుగు వేసే ప్రస‌క్తే లేద‌ని ఆమె తేల్చిచెప్పారు. బుధ‌వారం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన బ‌హుజ‌న జ‌న‌సేన యుద్ధభేరి స‌భ‌లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బహిరంగ సభలో మాయావతి మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్‌, బీజేపీల‌ను ప‌క్కన‌పెట్టి, జ‌న‌సేన‌, బీఎస్పీ, వామ‌ప‌క్ష కూట‌మిని గెలిపించండి. ఏపీలో కూట‌మి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుంది. కూట‌మి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అన్ని వ‌ర్గాల్లో సుఖ‌సంతోషాలు నింపే పాల‌న అందిస్తాం. రాష్ట్రంలో పేరుకుపోయిన ప్రజా స‌మ‌స్యల‌న్నింటినీ ప‌రిష్కరిస్తాం.

ద‌ళిత‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు న్యాయం చేస్తాం. పూలే, అంబేద్కర్‌, కాన్షీరాం లాంటి మ‌హానుభావుల క‌ల‌ల్ని సాకారం చేస్తాం. లోక్‌స‌భ‌, ఆంధ్రప్రదేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీఎస్పీ, వామ‌ప‌క్షాల కూట‌మి పక్షాన బ‌రిలోకి దిగుతున్న అభ్యర్ధుల‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో కూడా మ‌న ప్రభుత్వం అధికారంలోకి వ‌స్తుంది అని మాయావతి చెప్పుకొచ్చారు.

పవన్ సీఎం కాబోతున్నారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ యువ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయ‌న ఖ‌చ్చితంగా భారీ మెజార్టీతో గెలిచి సిఎం అవుతార‌న్న న‌మ్మకం నాకుంది. ముఖ్యమంత్రి ప‌ద‌వికి ప‌వ‌న్‌ అన్ని విధాలా ఆర్హులు. ఆయ‌న సిఎం అయితే బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్నతికి కృషి చేస్తార‌న్న న‌మ్మకం ఉంది. ప‌వ‌న్‌ ముఖ్యమంత్రి కావాల‌ని ప్రజ‌లు కూడా బ‌లంగా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అదే. చ‌ప్పట్లు కొట్టడం కాదు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. గ్రామ‌గ్రామాన తిరిగి ప్రజలు కూట‌మికి మ‌ద్దతు తెలిపేలా చైత‌న్యప‌ర‌చాలి.

అప్పుడే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది. మ‌న‌ల్ని ఓడించ‌డానికి ప్రత్యర్ధులు సామదాన దండోపాయాలన్నీ ప్రయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అధికార‌-ప్రతిప‌క్షాలు మీడియా బ‌లంతో, త‌ప్పుడు స‌ర్వేల‌తో ప్రజ‌ల్ని ప్రభావితం చేసే ప్రయ‌త్నం చేస్తాయి. వాటి మాయ‌లోప‌డొద్దు. వారిచ్చే మేనిఫెస్టోలు, మా గాలి వీస్తోంది అంటూ చేసే ప్రచారాలు అస‌లు న‌మ్మవ‌ద్దు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీల దొంగ హామీలు న‌మ్మొద్దు. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజ‌ల మ‌ద్దతు ఉన్న బీఎస్పీ, జ‌న‌సేన‌, వామ‌ప‌క్ష కూట‌మి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుంది అని మాయావతి ధీమా వ్యక్తం చేశారు.