కేసీఆర్ను టార్గెట్ చేస్తూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- IndiaGlitz, [Wednesday,March 06 2019]
మొన్న ఓటుకు నోటు, నిన్న నాగార్జున సాగర్ దగ్గర రెండు రాష్ట్రాల పోలీసుల గొడవ, నేడు డేటా చోరీ కేసు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడుతున్న రాజకీయ చదరంగంలో రెండు రాష్ట్రాల యువత నలిగిపోతోంది అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పోరాట యాత్రలో భాగంగా పవన్ గుంటూరు జిల్లా నరసారావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
పల్నాడు గడ్డ నుంచి కేసీఆర్కు విన్నపం..
ఇద్దరు బలమైన నాయకులు ఆడుతున్న రాజకీయ క్రీడలో ప్రజలు నష్టపోతున్నారు. పల్నాడు గడ్డ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటే విన్నపం చేస్తున్నాను. ఉద్యమం సమయంలో చాలా తిట్టారు. మీ ఉద్యమ స్ఫూర్తిని అర్ధం చేసుకుని భరించాము. రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాల మధ్య గొడవలంటే ప్రజలు భరించే స్థితిలో లేరు. ఒక వైపు తెలుగుదేశం పార్టీ మాతో కలిసి రావాలని పిలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ జగన్- పవన్ను కలుపుతాం అంటుంది. ఈ పొలిటికల్ గేమ్స్ చూసి చూసి విసుగొచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సీపీఐ, సీపీఎంతో తప్ప ఏ పార్టీతో కలిసిపోటీ చేయదు. జనసేన పార్టీ ప్రజలపక్షమే గానీ పార్టీల పక్షం కాదు అని ఈ సందర్భంగా పవన్ తేల్చిచెప్పారు.
మొత్తానికి చూస్తే... ఈ వ్యవహారం మొత్తమ్మీద కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారని స్పష్టంగా అర్థమవుతోంది. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ‘డేటా వార్’ వ్యవహారంపై పవన్ పై విధంగా ఫస్ట్ టైమ్ స్పందించారు. పవన్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా కేటీఆర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.