ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమమే - పవన్ కళ్యాణ్..!
- IndiaGlitz, [Tuesday,January 03 2017]
కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ఎందుకు ఇలా జరుగుతుందో కారణాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సహా 11 మండలాల్లో
కిడ్నీవ్యాధి సమస్యను ఘోర విపత్తుగా పేర్కొన్నారు. జనసేన ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.... ఉద్దానం కిడ్నీ సమస్య పై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పుష్కరాల కోసం, రాజధాని కోసం లెక్కలేనంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ...శ్రీకాకుళం జిల్లా కిడ్నీ బాధితుల వైపు అసలు చూడడం లేదు. ఇక్కడ నాయకులు సైతం పట్టించుకోకపోవడం దారుణం. ఈ ప్రాంత నాయకుల తీరును జనసేన ఖండిస్తుంది. ప్రభుత్వం వెంటనే ఒక కమిటీని వేసి ప్యాకేజీ ప్రకటించాలి. 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమమే అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.