Pawan Kalyan : ఎమ్మెల్యే బూతులు తిడుతున్నా.. ధైర్యంగా నిలబడ్డ వైనం: జనసేన వీరమహిళలకు పవన్ సత్కారం

  • IndiaGlitz, [Sunday,August 07 2022]

ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం విపక్ష పార్టీల కర్తవ్యమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. శనివారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గంటి పెదపూడిలో వరద సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేను ధైర్యంతో నిలదీసిన వీరమహిళలకు పవన్ కళ్యాణ్ శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం వారికి వెండి మహిషాసుర మర్దిని అమ్మవారి ప్రతిమలను బహూకరించారు. సత్కారం అందుకున్న వారిలో శ్రీమతి గంటా స్వరూప, శ్రీమతి ఎమ్. ప్రియా సౌజన్య, శ్రీమతి చల్లా లక్ష్మీ, శ్రీమతి కె.నాగ మానస, శ్రీమతి సుంకర కృష్ణవేణి, శ్రీమతి మేడిసెట్టి సత్యవాణి, శ్రీమతి బోడపాటి రాజేశ్వరి, శ్రీమతి బర్రె లక్ష్మీ, శ్రీమతి మోటూరి కనకదుర్గ ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను జనసేన విస్మరించదని స్పష్టం చేశారు. దానిని నిర్వర్తించేందుకు జనసేన పార్టీ వీర మహిళలు వెళ్తే అధికార పక్ష ఎమ్మెల్యే దుర్భాషలాడటం దురదృష్టకరమన్నారు.

సమస్యలు చెప్పుకుందామని వస్తే ఆడపడుచులపై బూతులు:

10 రోజుల క్రితం డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, గంటి పెదపూడిలో వరద బాధల్లో ఉన్న నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన వీర మహిళలు ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవడం ప్రభుత్వ సంకుచిత ధోరణిని తెలియచేస్తోందన్నారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన వేళ జనసేన జిల్లా నాయకుల్ని హౌస్ అరెస్ట్ లు చేసినా, ఏ మాత్రం తొణకకుండా వరద బాధితుల సమస్యలను చెప్పడానికి జనసేన వీర మహిళలు ప్రయత్నించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. వరదల్లో చిక్కుకున్న వారి సమస్యలను చెబుతున్న వీర మహిళల మీద ఇష్టానుసారం ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం హేయమన్నారు. సమస్యలు పరిష్కరించండి అని వినతిపత్రం ఇవ్వడానికి జనసేన నాయకులు వస్తే ఎందుకు భయమని పవన్ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం సాధారణ విషయమని.. అలా చేస్తేనే ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలుస్తాయని జనసేనాని చెప్పారు.

సీఎం వస్తున్నాడంటే చాలు విపక్షనేతల గృహ నిర్బంధాలు:

ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వస్తుంటే, ముందుగా అక్కడున్న నాయకుల్ని గృహ నిర్భందాలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వమని మేం కోరుతుంటే మీకు ఉలుకెందుకని ఆయన ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడుతున్న వారిని ఇష్టానుసారం బూతులు తిడుతున్నారని, కేసులు పెడుతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి వీర మహిళలు భవిష్యత్తు వారధులన్న ఆయన.. వారి పోరాటాలు మాకు స్ఫూర్తి మంత్రాలన్నారు. అడ్డగోలు కేసులకు, బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా నిలబడే వీర మహిళలకు పార్టీ ఎల్లపుడూ అండగా నిలబడుతుందని పవన్ హామీ ఇచ్చారు. వీర మహిళలు పార్టీకి పునాదులుగా పని చేస్తారని.. వారి పోరాటాలను మరింత విస్తృతం చేసేందుకు పార్టీ తరఫున త్వరలోనే వర్క్ షాపులను నిర్వహించి, వర్తమాన సామాజిక, రాజకీయ విషయాలపైనా వారికి అవగాహన కల్పిస్తామని పవన్ చెప్పారు. కచ్చితంగా అద్భుతమైన ప్రజా నాయకురాళ్లుగా వారిని తయారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల పక్షాన పోరాడాలి:

ప్రజాస్వామ్య దేశంలో మహిళల పాత్ర మరింత పెరగాలని... చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు జరిగేలా జనసేన పార్టీ తన వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుందని పవన్ చెప్పారు. వీర మహిళల మీద ఇష్టారీతిన నోరు పారేసుకున్న ఎమ్మేల్యే మీద మహిళా కమీషన్ కు, మానవ హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. పార్టీలో మహిళలను గౌరవించుకుంటామని... వారికి తగిన స్థానం ఇస్తామన్నారు. వీర మహిళల పోరాటాలను భావితరాలకు పాఠంగా చెప్పేలా మరిన్ని ప్రజా పోరాటాలు చేయాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

More News

Chiranjeevi: కంటెంట్ వుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని రుజువైంది.. బింబిసార, సీతారామంపై చిరు ప్రశంసలు

యువతను, ప్రతిభావంతులైన వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే.

Janasena : సంక్షేమ పథకాలు అందడం లేదంటే కేసులు పెడతారా : జగన్‌ ప్రభుత్వంపై నాదెండ్ల ఫైర్

వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న గడప గడపకు కార్యక్రమంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

Janasena : ఓఎన్జీసీపై రెండేళ్ల న్యాయపోరాటం .. ఎట్టకేలకు విజయం : జనసైనికుడిని అభినందించిన నాగబాబు

చమురు, సహజ వాయువుల సంస్థలైన గెయిల్, ఓఎన్జీసీ సంస్థలపై గత రెండేళ్లుగా న్యాయ పోరాటం చేసి గెలిచిన రాజోలు నియోజకవర్గంకు చెందిన జనసైనికుడు వెంకటపతి రాజాను అభినందించారు

Gorantla Madhav : నువ్వేమైనా టామ్‌క్రూజ్‌వా.. నీ సుందర ప్రతిబింబం చూసి జనానికి ఏమైందో : చింతకాయల విజయ్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Gorantla Madhav : అది మార్ఫింగ్ వీడియో కాకుంటే.. మాధవ్‌పై కఠిన చర్యలు తప్పవు : సజ్జల రామకృష్ణారెడ్డి

మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.