Pawan Kalyan: జ్వరం నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్.. తిరిగి ప్రచారం మొదలు..

  • IndiaGlitz, [Friday,April 05 2024]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. దీంతో వారాహి విజయభేరి యాత్ర తిరిగి ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది ఈనెల 7వ తేదీన అనకాపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఏప్రిల్ 8న యలమంచిలిలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఏప్రిల్ 9న ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. తదుపరి ఉత్తరాంధ్రలోని నెల్లిమర్ల, విశాఖ సౌత్, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తాం అని ప్రకటనలో తెలిపింది.

కాగా మార్చి 30న తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అప్పటికే అస్వస్థతతో ఉన్న సేనాని ఎండలో పాదయాత్ర చేయటంతో తీవ్ర జ్వరం బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తెనాలిలో జరగాల్సిన సభతో పాటు ఉత్తరాంధ్ర పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో హైదరాబాద్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన జ్వరం నుంచి కోలుకోవడంతో ప్రచారానికి సిద్ధమయ్యారు.

మరోవైపు పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం విధితమే. ఇప్పటికే పాలకొండ అసెంబ్లీ మినహా 20 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. పాలకొండ టీడీపీ సీనియర్ నేత నిమ్మక జయకృష్ణ ఇటీవల జనసేనలో చేరారు. దీంతో ఆయనకే టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అనంతరం పూర్తిస్థాయి ప్రచారంపైనే పవన్ దృష్టి పెట్టనున్నారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో రెండు సార్లు ప్రచారం నిర్వహించడంతో పాటు కూటమి తరపున నిర్వహించే భారీ బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. మొత్తానికి తమ అధినేత అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి ప్రచార బరిలోకి దిగనుండటంతో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.