పవన్ ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ స్టోరీ ఇదేనట..
- IndiaGlitz, [Friday,March 12 2021]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో పిరియాడిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి వైరల్ అవుతోంది. నిజానికి తెలంగాణకు చెందిన పండుగ సాయన్న కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. పండుగ సాయన్న పేదప్రజలకు దానధర్మాలు చేసిన వ్యక్తిగా, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా సుపరిచితుడు. సంపన్నుల నుంచి విరాళాలు తీసుకొని పేదలకు పంచి పెట్టేవాడు. అయితే ఆధిపత్య శక్తులు సాయన్నను ఒక బందిపోటుగా ముద్ర వేశాయి. అంతేకాకుండా హత్య చేసేందుకు పథకం వేసి.. దాని ప్రకారం నాటి ప్రభుత్వం చేత చంపిస్తారు.
ప్రత్యేకదళం ఏర్పాటు..
సాయన్న 1840 నుంచి 1885 మధ్య కాలానికి చెందినవాడు. తెలంగాణలోని మహబూబ్ నగర్‌కు దగ్గర నవాబ్‌పేట మండలం, మెరుగోని గ్రామానికి చెందినవాడు. ఆయన గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు. ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదాములు పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టేవాడు. దీంతో పాటు నాటి ఆధిపత్య శక్తులు చేసే అరాచకాన్ని ఎదుర్కోవడం కోసం ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల్లో సాయన్నకు పెరుగుతున్న ఆదరాభిమానాలను భూస్వాములు తట్టుకోలేక తప్పుడు కేసులు పెట్టించారు. ఆ తరువాత సాయన్నను చంపడానికి పథకం వేశారు. జంగు జలాల్ఖాన్ మోహితి మిన్‌సాబ్ ఎస్పీ నాయకత్వంలో సాయన్నను అరెస్టు చేసి హతమార్చే కుట్ర పన్నారు. అది ప్రజల తిరుగుబాటు.. వనపర్తి రాణి శంకరమ్మ చొరవతో విఫలమవుతుంది.
కుట్ర పన్ని హత్య..
అయితే సాయన్నను ఎలాగైనా హతమర్చాలని తలచిన భూస్వాములు మరల కుట్ర పన్నారు. తమకు అనుకూలంగా ఉన్న ఎస్పీ మోహితి మిన్ సాబ్ సాయంతో పథకం ప్రకారం సాయన్నకు మరణశిక్ష విధిస్తారు. పండుగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర విసిరేస్తారు. ప్రజలు ఆగ్రహంతో ఎస్పీ కార్యాలయం పైకి పోతారు. ఎస్పీ జనాగ్రహాన్ని చూసి గుండె పోటుతో చనిపోతారు. కుట్ర పన్నిన భూస్వాములంతా.. సాయన్న మరణం తర్వాత దావత్ చేసుకుంటున్న ప్రభుత్వ వసతి గృహాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టి తగులబెడతారు. అందులోనే వారు మసైపోతారు’’ ఇది పండుగ సాయన్న కథ. నిన్న శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన గ్లింప్స్ ఆధారంగా సెర్చ్ చేసిన నెటిజన్లు.. కథ ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.