బాల రాముడు ప్రాణప్రతిష్ట సమయంలో కన్నీళ్లు వచ్చాయి: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
కోట్ల మంది భారతీయులు 500 ఏళ్లు నుంచి ఎదురుచూసిన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యా్హ్నం అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం నభూతో నభవిష్యత్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ "ఈరోజు నాకు చాలా భావోద్వేగంగా ఉంది. ప్రాణప్రతిష్ఠ సమయంలో నా కళ్ల నుంచి కన్నీళ్లు వచ్చాయి. ఈ అద్భుతమైన కార్యక్రమం భారతదేశాన్ని ఒకే జాతిగా బలోపేతం చేసింది. శ్రీ రామచంద్రుడు ధర్మం, సహనం, త్యాగం, ధైర్యసాహసాలకు ప్రతిరూపం. అందరికీ స్పూర్తిదాయకం. శ్రీరాముని మార్గంలోనే భారత దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయోధ్య రామాలయ నిర్మాణంలో మనందరం పాలుపంచుకోవడం సమిష్ట బాధ్యత" అని చెప్పారు. 500 ఏళ్ల నాటి కల సాకారమవుతున్న వేళ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని.. రామమందిరం నిర్మాణం ప్రత్యేక శ్రద్ధ చూపిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా అయోధ్య రామాలయానికి పవన్ కల్యాణ్ రూ.30లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ ఇవాళ మర్చిపోలేని రోజు అని చిరు వెల్లడించారు. అటు అయోధ్య రామమందిరం అద్భుతమని.. జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అపూర్వ అవకాశం వస్తుందని రామ్ చరణ్ తెలిపారు. భారతదేశంలో పుట్టడం... బాలరాముడు ప్రాణప్రతిష్ఠ వేడుకను కళ్లారా చూడటం ఆనందంగా ఉందన్నారు. ఇది ఆ భగవంతుడి ఆశీర్వాదమే అని చెప్పుకొచ్చారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని చెర్రీ అన్నారు.
అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడని తెలిపారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘జై సియా రామ్’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ.. ఇక నుంచి మన రాముడు టెంట్‌లో ఉండాల్సిన అవసం లేదని రామ మందిరంలోనే ఉంటాడని చెప్పారు. జనవరి 22, 2024 చరిత్రలో నిలిచిపోతుందని.. వెయ్యేళ్ల తర్వాత కూడా జనవరి 22 గురించి మాట్లాడుకుంటారని పేర్కొన్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు 14 ఏళ్లు అయోధ్యకు దూరంగా ఉంటే.. ఇప్పుడు మళ్లీ అయోధ్యకు రావడానికి శతాబ్దాలు పట్టిందని భావోద్వేగంతో ప్రసంగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments