పవన్ సీఎం అయితే మొదటి సంతకం...
- IndiaGlitz, [Monday,March 25 2019]
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే నా మొదటి సంతకం రైతుల పెన్షన్ ఫైల్ పైన , రెండో సంతకం ఆడపడుచులకు ఉచిత గ్యాస్, రేషన్‌కు బదులు వారి ఖాతాల్లో నగదు జమ పథకంపై సతకం పెడతాం. మూడో సంతకం 3 లక్షల ఉద్యోగాల భర్తీపై పెడతాను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లాలో పెడననియోజకవర్గం జనసేన బహిరంగ సభా వేదికగా పవన్ మాట్లాడుతూ.. విద్యా, వైద్యం ఉచితం చేస్తాం. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం. యువతకు అర్హతకు తగ్గ ఉద్యోగాలు కల్పిస్తాం. 25వేల స్పెషల్ పోలీస్ ఉద్యోగాలు ఇస్తాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఎలాంటి చదువులు చదివితే ఉద్యోగాలు వస్తాయో అలాంటి చదువులను ఉచితంగా అందిస్తాం.
సంవత్సరంలో తాగు నీటి సమస్యను తీరుస్తాం. ఉప్పుటేరు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సంవత్సరంలో సాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. ఇక్కడ నుంచి జనసేన పార్టీ నిలబెట్టిన ఎంపీ అభ్యర్ధిని గెలిపిస్తే.. నరసాపురం, బంటుమిల్లి, మచిలీపట్నం, రేపల్లె వరకు రైల్వే లైన్ తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది. మచిలీపట్నం, పెడన జంటనగరాలుగా తీర్చిదిద్దుతాం.
మచిలీపట్నం తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. ఆక్వా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తాం. 58 ఏళ్లు నిండిన మత్స్యకారులకు రూ.5 వేలు పెన్షన్, వేట నిషేధం సమయంలో రోజుకు రూ.500 ఇస్తాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేసి 99 పైసలకే రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేసి పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీ అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌ను, మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి శ్రీ బండ్రెడ్డి రామును భారీ మోజార్టీతో గెలిపించాలి అని పవన్ కల్యాణ్ కోరారు.