Janasena : జనసేన మహిళా నేతకు అర్థరాత్రి పూట ఫోన్లు, బాలినేని గారూ.. ఇది కరెక్ట్ కాదు : పవన్ ఆగ్రహం

  • IndiaGlitz, [Saturday,June 25 2022]

తమ పార్టీ అధికార ప్రతినిధి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమేనని.. కానీ స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెబుతామని పవన్ హెచ్చరించారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పక్కన ఉండేవాళ్ళు అర్థరాత్రి ఫోన్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అర్ధరాత్రి ఫోన్లు చేసి ఆ మాటలేంటీ:

ఫోన్లు చేయడమే కాకుండా.. మానమర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడటం ఏం పద్ధతని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా రాయపాటి అరుణ తెలియజేశారని అన్నారు. ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాని బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన విషయంలో ధైర్యంగా ఉండాలని అరుణకి ఫోన్ ద్వారా చెప్పానని పవన్ తెలిపారు.

ఆ ఛానెళ్లపై కేసులు ఉపసంహరించుకోండి:

ఆడబిడ్డను వేధించిన ఘటనను ప్రసారం చేసిన మహా టీవీ, 99 టీవీ ఛానెళ్లపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియచేసేది ఒక్కటేనని.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పాలంటూ పవన్ కల్యాణ్ హితవు పలికారు. రాజకీయాల్లో విధివిధానాలపై మాట్లాడుకుంటామని.. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదన్నారు. మహా టీవీ, 99 టీవీ ఛానెళ్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకొని సమస్యకు ముగింపు పలకాలని పవన్ కల్యాణ్ కోరారు.