ఆ ఇళ్లను చూసి చలించిపోయిన పవన్
- IndiaGlitz, [Monday,February 25 2019]
కర్నూలు పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్నాథగట్టుపై నిర్మించిన ఇందిరమ్మ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ఇళ్లు, బాధితుల గోడు విన్న పవన్ చలించిపోయారు. అనంతరం మాట్లాడుతూ.. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తతకు నిలువెత్తు నిదర్శనం జగన్నాథగట్టులోని ఇందిరమ్మ కాలనీ అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల్లో డబ్బులు ఎలా వృథా అవుతాయో జగన్నాథగట్టులో నిర్మించిన ఇళ్లను చూస్తే తెలుస్తుందన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం కుమ్మరించి 400 ఎకరాల్లో 9వేల 400 కుటుంబాలు నివసించడానికి నిర్మించిన ఈ ఇళ్లను చూస్తే బాధేస్తుందన్నారు. చాలా వరకు ఇళ్లు శిథిలావస్థకు చేరుకుని ముళ్ల చెట్లు, పాముల పుట్టలకు ఆవాసంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైన మౌలిక వసతులను కల్పించడం అధికార యంత్రాంగం బాధ్యత అన్నారు.
పవన్‌కు గోడు వినిపించిన బాధితులు..
ఈ సందర్భంగా బాధితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు తమ గోడును వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్నాథగుట్టలో ఇందిరమ్మ కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, ఇళ్లు నిర్మించుకోవడానికి రూ. 60వేలు సబ్సిడి ఇస్తామని చెప్పి సగమే ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన సగానికి తోడు అప్పులు చేసి సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించుకున్నామని కొందరు బాధితులు కంటతడిపెట్టారు. అయితే ఇళ్లు నిర్మించుకోవడానికి ఇళ్ల స్థలం ఇచ్చిన ప్రభుత్వం .. మౌలిక వసతులైన రోడ్లు, కరెంటు, ఆస్పత్రి ఏర్పాటు చేయడంలో విఫలమైందని వాపోయారు. దీంతో చీకటి ఇళ్లలో నివసించలేక, మరోవైపు దొంగల భయం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో మళ్లీ లోతట్లు ప్రాంతాలకు తరలిపోయి ఇంటి కోసం చేసిన అప్పులు తీరుస్తూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. కచ్చితంగా బాధితులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.