వర్మపై రివెంజ్‌కి ప్లాన్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య బయోపిక్‌ల బాట పట్టిన విషయం తెలిసిందే. ఎవరికి ఎంత ఇబ్బంది కలిగినా ఆయనకు పట్టదు. తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు. ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టినా.. ఎవరూ వర్మ జోలికి వెళ్లేందుకు సాహసించరు. కానీ ఇప్పుడు ఆయనపై రివెంజ్‌కి ప్లాన్ సిద్ధం చేస్తున్నారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం వర్మ ‘పవర్ స్టార్’ పేరుతో పవన్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 22న విడుదల కాబోతోంది. ఈ ట్రైలర్‌కు కూడా వర్మ రూ.25 చొప్పున వసూలు చేయబోతున్నారు. సినిమా ఈ నెల 25న విడుదల చేయనున్నారు. వర్మ విడుదల చేస్తున్న పోస్టర్స్‌ను చూసిన పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు రివెంజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే వర్మపై సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు.

వర్మపై తీయబోయే సినిమాకు టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ‘పరాన్నజీవి’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘రెక్‌లెస్ జెనెటిక్ వైరస్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రూపొందనుంది. 99 థియేటర్ బ్యానర్‌పై స్కైమీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు నిర్మాత సీఎస్ కాగా.. డాక్టర్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లనుఅధికారికంగా వెల్లడిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. వ‌ర్మ‌ సినిమా అంటే ఎలా ఉంటుందో ముందే ఒక అవగాహనకు వచ్చేయవచ్చు. కానీ.. వ‌ర్మ‌పై సినిమా అంటే ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి మొదలైంది. ఒకరకంగా చెప్పాలంటే వర్మకు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ. అటు ఎన్నికలకు ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసి.. టీడీపీ కార్యకర్తలు, నేతల ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు పవన్ అభిమానుల ఆగ్రహం.. ఇంకేముంది.. వర్మపై తీయబోయే సినిమాపై సహజంగానే ఆసక్తి పెరిగింది.