పదే పదే ఎందుకిలా  పవన్.. అయోమయంలో ఫ్యాన్స్!?

  • IndiaGlitz, [Thursday,January 09 2020]

2014 నుంచి ఇప్పటి వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పడిన ముద్రను చెరిపేసుకోలేకపోతున్నారా..? టీడీపీ అధినేత చంద్రబాబుకు విధేయుడిగా ఎందుకున్నారు..? చంద్రబాబు ఏదైనా కార్యక్రమం మొదలుపెడితే మెచ్చుకోవడం.. అసవరమైతే ట్వీట్స్ చేయడం.. లేదంటే మద్దతివ్వడం పనిగా పెట్టుకున్నారా..? వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది కూడా ముగియక మునుపే ఎన్నెన్ని సంక్షేమ పథకాలు, నవరత్నాల హామీలు నెరవేర్చుకుంటూ పోతుంటే ఎందుకు ఒక్కమాటగా మెచ్చుకోవడానికి మనసు రావట్లేదా..? జగన్ నిర్ణయాలను చిరంజీవి స్వాగతించినప్పటికీ తమ్ముడు మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు..? అనే విషయాలు www.indiaglitz.com ప్రత్యేక కథనంలో చూద్దాం.

నాటి నుంచి నేటి వరకూ!
2014లో టీడీపీ-బీజేపీ మిత్రపక్షానికి పవన్ కల్యాణ్ సపోర్ట్ చేయడంతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. అయితే అప్పట్లో చంద్రబాబుకు మంచి సన్నిహితుడిగా ఉన్న పవన్.. ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో తేడా రావడంతో విబేధించినట్లు తెలిసింది. అయితే ఆ విబేధాలు అంతా ఉత్తుత్తే అని లోలోపల వీరికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయని తర్వాత చాలా సందర్భాల్లో నిరూపితమైంది. మరీ ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు కూడా ఇద్దరూ చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి జగన్‌ను టార్గెట్ చేయడం.. అందుకే వేర్వేరుగా పోటీ చేసి జగన్‌ను ఇరుకున పెట్టాలని ఆలోచించడంతో అసలు ఎసరుకు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పిన మాట వాస్తవమే.

అయోమయంలో పవన్ ఫ్యాన్స్!
ఎన్నికల్లో జరగాల్సింది జరిగిపోయింది.. ఫలితాలొచ్చేశాయ్.. జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేశారు. ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌గా భావిస్తూ అమలు చేసేందుకు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మళ్లీ సేమ్ సీన్ ఇక్కడ కూడా చంద్రబాబు ఓ వైపు.. మరోవైపు పవన్.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తుండటంతో అబ్బే వీరిద్దరూ విడిపోలేదు.. కలిసే ఉన్నారంటూ మరోసారి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జగన్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ దుమ్మత్తిపోసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్.. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాల బాట పట్టి.. ఒక్కో జిల్లా ఒక్కో మాట మాట్లాడి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సిందేనని.. రాజధాని కర్నూలు అయితే బాగుంటుందని ఓసారి.. అబ్బే అమరావతిని తరలించే ప్రసక్తే లేదని ఇప్పుడు.. మాట్లాడటంతో ఆయన అభిమానులు, కార్యకర్తలే అయోమయంలో పడ్డారు.

అన్న అలా.. తమ్ముడిలా..!
మరీ ముఖ్యంగా నవ్యాంధ్రలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే వికేంద్రీకరణ అనేది జరగాలని భావించిన జగన్.. కర్నూలు, విశాఖ, అమరావతిగా మూడు రాజధానులుగా చేయాలని భావించారు. దీనిపై ప్రస్తుతం కమిటీలు ఇచ్చిన నివేదికలపై హైపవర్ కమిటీ పర్యవేక్షణ జరుగుతోంది. అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకించడం.. సెటైర్లేయడం మొదలుపెట్టారు. మరోవైపు మెగస్టార్ చిరంజీవి మాత్రం సపోర్ట్ చేయడం.. రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను చిరు స్వాగతించడం.. పవన్ వ్యతిరేకించడంతో మెగాభిమానులు తర్జన భర్జన పడుతున్నారు.

మద్దతిస్తే పోయేదేముంది..!?
వాస్తవానికి ఎవరేమనుకున్నా.. జగన్ సీఎం పీఠమెక్కిన అతికొద్దిరోజుల్లో ఎన్నో సంచలన నిర్ణయాలు కనివినీ ఊహించని రీతిలో అన్ని హామీలు అమలు చేసేందుకు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో చాలా వరకు అన్నీ సక్సెస్ అయ్యాయ్ కూడా. దేశ వ్యాప్తంగా ఇంతవరకూ ప్రభుత్వంలోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లో ఇలా చేసిన ముఖ్యమంత్రులెవ్వరూ లేరు.. ఇది అక్షరాలా నిజమని వైసీపీ శ్రేణులు, పలువురు విశ్లేషకులు చెబుతున్న మాట. మరి పవన్ మాత్రం ప్రతి ఒక్కటి తప్పుబట్టడమే పనిగా పెట్టుకుని.. ఆఖరికి ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వన్ అండ్ ఓన్లీ రాపాక మెచ్చుకుంటున్నప్పటికీ పవన్ మాత్రం వేలెత్తి చూపడమే పనైపోయింది. పదే పదే ఇలా చేస్తూ పోతే ఎలా ఉంటుంది..? అనే విషయంలో ఆయన్ను సపోర్ట్ చేసే వీరాభిమానులు, కార్యకర్తలకే తెలియాలి మరి.

ముద్ర చెరుపుకునేదెప్పుడో..!
2014 ఎన్నికలు మొదలుకుని నిన్నా మొన్న చంద్రబాబు అరెస్ట్‌ల దాదాపు అన్ని విషయాల్లోనూ ఆయనకు పవన్ మద్దతుగానే నిలుస్తూనే వస్తున్నారని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయ్. అయితే నిన్నగాక మొన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం చేస్తే.. ఆ దాడిని కనీసం ఖండించకపోగా.. ఏదో ప్రెస్‌నోట్ విడుదల చేయడం ఎంతవరకు సబబో చెప్పాలని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ‘రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచివేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు మంచివి కాదని.. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం ఉంది’ అని హెచ్చరించారు. మరోసారి మద్దతుగా నిలవడంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు-పవన్ ఒక్కటే అని ముద్ర పడిపోయింది. మరి ఈ ముద్ర చెరుపుకోవడానికి పవన్ ఎప్పుడు ప్రయత్నాలు చేస్తారో..? ఏంటో మరి..!