పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కార్యక్రమాలకు దూరం!
- IndiaGlitz, [Thursday,September 26 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గబ్బర్‌సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నపూసకు తీవ్ర గాయమైంది. వెన్నునొప్పుతో బాధపడుతున్న ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న స్వయానా పవనే.. జనసేన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. ఆయన అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరకుంటున్నారు.
అశ్రద్ధ చేయడం వల్లే నొప్పి!
‘విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశానికి నన్నుఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున సంపూర్ణ మద్దతును తెలియచేస్తున్నాను. అయితే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను.
గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం పై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను’ అని పవన్ చెప్పుకొచ్చారు.
అందుకే రాలేకపోతున్నా!
‘గత కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. అయితే జనసేన తరఫునుంచి పార్టీ ప్రతినిధులు మీరు నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని జనసేనాని ప్రకటనలో పేర్కొన్నారు. పవన్ చేసిన ఈ ట్వీట్‌కు పలువురు మెగాభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.