ఆ దృశ్యాలు నా గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి: పవన్
- IndiaGlitz, [Sunday,January 24 2021]
దివీస్ నిరసనకారుల విడుదల సంతోషాన్నిచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అక్కడి బాధితుల ఆవేదన, ఆక్రందనలను స్వయంగా చూశానన్నారు. ‘‘తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్తపాకల గ్రామంలో దివీస్ కర్మాగారాన్ని వ్యతిరేకిస్తూ జైలు పాలైన 36 మంది ఉద్యమకారులు జైలు నుంచి విడుదలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ నెల 9వ తేదీన ఆ ప్రాంతంలో పర్యటించి, అక్కడి వారికి భరోసాగా బహిరంగ సభ నిర్వహించినప్పుడు బాధితుల ఆవేదన, ఆక్రందన, నిస్సహాయతలను స్వయంగా చూశాను.
జైలు పాలైన తమ వారి కోసం అక్కడి మహిళలు కన్నీరు మున్నీరై విలపించిన హృదయ విదారక దృశ్యాలు నా గుండెల్లో ఇంకా పచ్చిగానే మిగిలి ఉన్నాయి. దివీస్ కర్మాగారం విడుదల చేసే కాలుష్యం తమ జీవితాలను హరించేస్తుందన్న భయాందోళనలతో నిరసన తెలిపిన వారిలో 36 మందిని అరెస్టు చేసి జైలులో పెట్టడం గ్రామస్తుల్లో మరింత భయాందోళనలకు కారణమైంది. ఆ రోజు కొత్త పాకల గ్రామంలోని సభలో నేను ముందుగా కోరింది కూడా తక్షణం 36 మందిని విడుదల చెయ్యమనే... ఎట్టకేలకు వారందరికీ బెయిలు రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారికి, బెయిల్ మంజూరు చేసిన గౌరవ హైకోర్టుకు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు. ఇదే విజ్ఞతతో వారిపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని, దివీస్ కర్మాగారం చుట్టు పక్కల గ్రామాల వారి విజ్ఞాపనలను సానుకూలంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పవన్ తెలిపారు.